Egg Crisis : యుద్ధం దెబ్బకు కోడిగుడ్డు విలవిల.. దారుణంగా పడిపోయిన రేటు.

Egg Crisis : యుద్ధం దెబ్బకు కోడిగుడ్డు విలవిల.. దారుణంగా పడిపోయిన రేటు.
X

Egg Crisis :ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న యుద్ధ సెగలు ఇప్పుడు కోడిగుడ్ల పరిశ్రమను కూడా తాకాయి. ఎగ్ సిటీగా పేరుగాంచిన తమిళనాడులోని నమక్కల్ కోళ్ల రైతులు ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఎగుమతులు నిలిచిపోయి, సుమారు 3.5 కోట్ల కోడిగుడ్లు సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయాయి. దీంతో లోకల్ మార్కెట్‌లో గుడ్ల ధరలు దారుణంగా పడిపోయి, రైతులకు రోజుకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.

ఫిబ్రవరి 28వ తేదీన సుమారు 70 కంటైనర్లలో 3.5 కోట్ల కోడిగుడ్లను యూఏఈ, ఇతర అరబ్ దేశాలకు ఎగుమతి చేశారు. అయితే ఎర్ర సముద్రం ప్రాంతంలో యుద్ధం కారణంగా రవాణా నౌకలు ముందుకు కదల్లేక మధ్యలోనే ఆగిపోయాయి. ఒక్కో గుడ్డు ధర దాదాపు రూ.4.80 చొప్పున లెక్కిస్తే, కేవలం సరుకు విలువే రూ.17 కోట్ల వరకు ఉంటుంది. దీనికి అదనంగా కంటైనర్ అద్దెలు, ఇంధన ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ అనిశ్చితి వల్ల ఎగుమతిదారులు కొత్త ఆర్డర్లు తీసుకోవడానికి భయపడుతున్నారు.

భారతదేశం నుంచి ఎగుమతయ్యే గుడ్లలో 95 శాతం వాటా ఒక్క నమక్కల్‌దే. ఇక్కడ రోజుకు 6 నుంచి 7 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఎగుమతులు ఆగిపోవడంతో, విదేశాలకు వెళ్లాల్సిన గుడ్లన్నీ స్థానిక మార్కెట్‌కు చేరుతున్నాయి. సప్లై పెరగడంతో ధరలు అమాంతం పడిపోయాయి. ఒక్కో గుడ్డు ఉత్పత్తి చేయడానికి రైతుకు దాదాపు రూ.5 ఖర్చవుతుంటే, ప్రస్తుతం మార్కెట్‌లో కేవలం రూ.3.50కే విక్రయించాల్సి వస్తోంది. అంటే ఒక్కో గుడ్డుపై రూపాయిన్నర నష్టం వస్తోంది. ఈ లెక్కన నమక్కల్ కోళ్ల పరిశ్రమకు రోజుకు రూ.10.5 కోట్ల నష్టం సంభవిస్తోందని అంచనా.

గుడ్లు త్వరగా పాడైపోయే సరుకు కావడం, ఎండలు పెరుగుతుండటంతో రైతులు నిల్వ ఉంచలేక తక్కువ ధరకైనా అమ్మేస్తున్నారు. ఎగ్ అండ్ పోల్ట్రీ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ప్రకారం.. ఈ పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే చిన్న స్థాయి కోళ్ల ఫారాలు మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. షిప్పింగ్ కంపెనీలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ సాగుతోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ అతలాకుతలం అవ్వడం మన రైతులకు శాపంగా మారింది.

Tags

Next Story