10 Minute Delivery : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..బ్లింకిట్, జెప్టోలకు గట్టి వార్నింగ్.

10 Minute Delivery : ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు షాకింగ్ న్యూస్. ఇకపై మీరు ఆర్డర్ చేసిన సామాన్లు పది నిమిషాల్లో మీ గుమ్మం ముందుకు రాకపోవచ్చు. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జొమాటో వంటి కంపెనీలు ఇప్పటివరకు ఇస్తున్న 10 మినిట్స్ డెలివరీ హామీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. డెలివరీ పార్ట్‌నర్స్ ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపై అతివేగంగా వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారనే ఫిర్యాదులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మంత్రి మన్సుఖ్ మాండవీయ జోక్యం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల ప్రముఖ డెలివరీ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. పది నిమిషాల్లో డెలివరీ చేయాలనే ఒత్తిడి కారణంగా డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, దీనివల్ల వారి ప్రాణాలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ముప్పు వాటిల్లుతోందని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా మరియు ప్రకటనల నుంచి 10 నిమిషాల డెలివరీ అనే ట్యాగ్‌లైన్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు స్పందించిన కంపెనీలు, తమ బ్రాండ్ మెసేజింగ్ నుంచి ఆ హామీని తొలగిస్తామని హామీ ఇచ్చాయి.
ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడంలో బ్లింకిట్ అందరికంటే ముందు నిలిచింది. తన పాత ట్యాగ్‌లైన్ 10 నిమిషాల్లో 10,000+ ఉత్పత్తులు అనే దానిని మార్చేసింది. ఇప్పుడు దాని స్థానంలో మీ ఇంటి వద్దకే 30,000+ ఉత్పత్తులు అని అప్‌డేట్ చేసింది. అంటే సమయం కంటే సర్వీస్ నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తామని ఆ కంపెనీ సంకేతాలిచ్చింది. రానున్న రోజుల్లో జెప్టో, స్విగ్గీ వంటి ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి.
గత ఏడాది డిసెంబర్ 25, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ పెద్ద ఎత్తున సమ్మె చేశారు. డెలివరీ సమయాన్ని పెంచాలని, తమకు పని భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆ నిరసనల సెగ కేంద్ర ప్రభుత్వానికి చేరడంతోనే ఇప్పుడు ఈ మార్పులు వచ్చాయి. ఇకపై డెలివరీ బాయ్స్ ఎటువంటి టెన్షన్ లేకుండా, ప్రాణాలకు తెగించకుండా ప్రశాంతంగా తమ పనిని పూర్తి చేసే అవకాశం లభించనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

