Electric Car Battery Issue : ఏంటి బ్రో..రాత్రంతా కారు ఆపి ఉంచినా ఛార్జింగ్ ఎందుకు తగ్గుతోంది?

Electric Car Battery Issue : ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం జోరందుకుంటోంది. అయితే పెట్రోల్ కార్లతో పోలిస్తే వీటి మెయింటెనెన్సులో కొత్త రకం సందేహాలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది బ్యాటరీ డ్రెయిన్. కారును రాత్రంతా ఇంట్లోనే పార్క్ చేసినా, ఉదయం లేచి చూసేసరికి ఛార్జింగ్ శాతం తగ్గిపోతోందని చాలామంది కంగారుపడుతుంటారు. అసలు కారు ఆపి ఉంచినా ఛార్జింగ్ ఎందుకు తగ్గుతుంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? బ్యాటరీని ఎలా కాపాడుకోవాలి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
బ్యాక్‌గ్రౌండ్ సిస్టమ్స్
చాలామంది తమ ఎలక్ట్రిక్ కారును ఆఫ్ చేసినప్పుడు బ్యాటరీ ఖర్చు కాదని అనుకుంటారు. కానీ అది తప్పు. కారు ఆగి ఉన్నప్పటికీ, దాని లోపల కొన్ని సిస్టమ్స్ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సెక్యూరిటీ ఫీచర్లు, రిమోట్ కనెక్టివిటీ (యాప్ ద్వారా కారును చెక్ చేయడం), సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు వంటివి బ్యాటరీ నుంచి కొద్దికొద్దిగా శక్తిని గ్రహిస్తూనే ఉంటాయి. దీనివల్ల 1 నుంచి 2 శాతం ఛార్జింగ్ తగ్గడం అనేది సాధారణ విషయం.
వాతావరణం చూపే ప్రభావం
ఈవీలలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలపై వాతావరణం భారీ ప్రభావం చూపుతుంది. విపరీతమైన చలి ఉన్నప్పుడు బ్యాటరీలోని కెమికల్ రియాక్షన్ నెమ్మదిస్తుంది, దీనివల్ల రేంజ్ తగ్గినట్లు అనిపిస్తుంది. ఇక విపరీతమైన ఎండల వల్ల బ్యాటరీ లోపల వేడి పెరుగుతుంది. ఈ వేడిని తగ్గించడానికి కారులోని థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా కూలింగ్ ఫ్యాన్లను ఆన్ చేస్తుంది. దీనివల్ల కూడా ఛార్జింగ్ ఖర్చవుతుంది. అందుకే కారును ఎప్పుడూ నీడలో లేదా కవర్ కింద పార్క్ చేయడం ఉత్తమం.
బ్యాటరీ బలహీనపడిందని ఎలా గుర్తించాలి?
ఒకవేళ రాత్రికి రాత్రే 5 శాతం కంటే ఎక్కువ ఛార్జింగ్ తగ్గుతుంటే మాత్రం మీరు జాగ్రత్త పడాలి. బ్యాటరీ లోపల ఏదైనా లోపం ఉండవచ్చు లేదా ఛార్జింగ్ సిస్టమ్‌లో సమస్య ఉండవచ్చు. కారు రేంజ్ అకస్మాత్తుగా పడిపోవడం, ఛార్జింగ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, డ్యాష్‌బోర్డుపై తరచుగా వార్నింగ్ లైట్లు రావడం వంటివి బ్యాటరీ బలహీనతకు సంకేతాలు. ఇలాంటి సమయాల్లో వెంటనే సర్వీస్ సెంటర్‌ను సంప్రదించడం మంచిది.
బ్యాటరీ లైఫ్ పెంచే చిట్కాలు
మీ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ఎక్కువ కాలం మన్నాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కారును ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టాల్సి వస్తే, ఛార్జింగ్‌ను పూర్తిగా 100% ఉంచొద్దు లేదా 10% కంటే తక్కువకు రానివ్వద్దు. 40% నుంచి 60% మధ్య ఛార్జింగ్ ఉంచి పార్క్ చేయడం బ్యాటరీకి క్షేమం. వీలైనంత వరకు స్లో ఛార్జింగ్‌నే వాడండి, అత్యవసరమైతే తప్ప ఫాస్ట్ ఛార్జింగ్ జోలికి వెళ్లకండి. ఎండలో కారును ఎక్కువసేపు ఉంచకుండా చూసుకుంటే మీ ఈవీ బ్యాటరీ ఎంతో కాలం భద్రంగా ఉంటుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
