EV Market : ఈ 3 ఎలక్ట్రిక్ కార్లదే హవా.. ఈవీ మార్కెట్‌లో ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ.

EV Market : ఈ 3 ఎలక్ట్రిక్ కార్లదే హవా.. ఈవీ మార్కెట్‌లో ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ.
X

EV Market : భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ గత కొన్నేళ్లుగా స్థిరంగా పెరుగుతోంది. నవంబర్ 2025 లో కూడా ఈ వృద్ధి కొనసాగింది. పండుగల సీజన్ ముగిసిన తర్వాత నెలవారీ అమ్మకాలు కొద్దిగా తగ్గినప్పటికీ, ఏడాది పరంగా వృద్ధి చాలా బలంగా ఉంది. ఈ వృద్ధికి ముఖ్యంగా టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రా కంపెనీలు ప్రధాన కారణంగా నిలిచాయి. నవంబర్ 2025 లో భారతదేశంలో మొత్తం 14,850 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం నవంబర్‌తో పోలిస్తే 61.87% అధికం. అయితే, అక్టోబర్ 2025 (18,055 యూనిట్లు) తో పోలిస్తే అమ్మకాలు 17.75% తగ్గాయి. మొత్తం ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా కూడా పెరిగి 3.8% కి చేరుకుంది. ఇది అక్టోబర్‌లో 3.3% గా ఉంది.

టాటా మోటార్స్ స్థానం సుస్థిరం

భారతదేశ ఈవీ మార్కెట్‌లో టాటా మోటార్స్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. నవంబర్ 2025 లో కంపెనీ మొత్తం 6,153 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. గత సంవత్సరం నవంబర్ (4,449 యూనిట్లు) తో పోలిస్తే, కంపెనీ 38.30% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అయినప్పటికీ అక్టోబర్ 2025 (7,239 యూనిట్లు) అమ్మకాలతో పోలిస్తే నెలవారీ అమ్మకాలు 15% తగ్గాయి. టాటా మోటార్స్, నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ వంటి మోడళ్లతో దేశ ఈవీ మార్కెట్లో అత్యధిక వాటాను కలిగి ఉంది.

ఎంజీకి విండ్‌సర్ ఈవీ బలం

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ కంపెనీ అమ్మకాలు పెరగడంలో విండ్‌సర్ ఈవీ మోడల్ కీలక పాత్ర పోషించింది. విండ్‌సర్ మోడల్ స్థిరంగా మంచి పనితీరు కనబరుస్తూ ఇతర ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీనిస్తోంది. నవంబర్ 2025 లో కంపెనీ మొత్తం 3,693 యూనిట్లను విక్రయించింది, ఇది గత సంవత్సరం నవంబర్ (3,347 యూనిట్లు) తో పోలిస్తే 10.34% వార్షిక వృద్ధి. అయితే, అక్టోబర్ 2025 (4,549 యూనిట్లు)తో పోలిస్తే నెలవారీ అమ్మకాలు 1,882 యూనిట్లు తగ్గాయి. కొత్త మోడళ్ల రాకతో ఎంజీ మార్కెట్లో మరింత పటిష్టంగా నిలబడింది.

మహీంద్రా అద్భుతమైన వృద్ధి

మహీంద్రా కంపెనీ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. బోర్న్ ఎలక్ట్రిక్ సిరీస్‌లోని BE 6, XEV 9e, కొత్తగా విడుదలైన XEV 9S వంటి మోడళ్లతో కంపెనీ జోరు పెరిగింది. నవంబర్ 2025 లో మహీంద్రా మొత్తం 2,966 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం నవంబర్ (583 యూనిట్లు)తో పోలిస్తే 408.75% భారీ వార్షిక వృద్ధి. ఆ సమయంలో కంపెనీ కేవలం XUV400 ఈవీని మాత్రమే విక్రయించేది. అయినప్పటికీ అక్టోబర్ 2025 (4,549 యూనిట్లు)తో పోలిస్తే నెలవారీ అమ్మకాలలో 18.82% తగ్గుదల కనిపించింది. కొత్త మోడళ్ల కారణంగా మహీంద్రా ఈవీ మార్కెట్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సంస్థగా నిలిచింది.

Tags

Next Story