FASTag : జేబులో రూపాయి లేకపోయినా పర్లేదు..మీ కారుకు ఫాస్టాగ్ ఉంటే చాలు.. అన్నిటికీ ఇదే పేమెంట్

FASTag : హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేసిన ఫాస్టాగ్, ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తబోతోంది. ఇప్పటివరకు కేవలం టోల్ చెల్లింపులకే పరిమితమైన ఈ స్మార్ట్ ట్యాగ్, త్వరలో మీ కారుకు ఒక డిజిటల్ వాలెట్ లాగా మారిపోనుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్‌ను మల్టీపర్పస్ గా మార్చేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అంటే ఇకపై మీ కారుకు పెట్రోల్ కొట్టించినా, పార్కింగ్ ఫీజు కట్టాలన్నా.. జేబులో నుంచి పర్స్ తీయాల్సిన పనిలేదు, ఫాస్టాగ్ ఉంటే చాలు.
గత ఆరు నెలలుగా దేశంలోని పలు ప్రాంతాల్లో దీనిపై నిర్వహించిన ట్రయల్స్ విజయవంతం కావడంతో, ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఫాస్టాగ్‌ను కేవలం టోల్ గేట్ల వద్దే కాకుండా, నిత్య జీవితంలో వాహనదారులు ఎదుర్కొనే ఇతర ఖర్చులకు కూడా అనుసంధానించాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఫిన్‌టెక్ కంపెనీలు, టోల్ ఆపరేటర్లు, బ్యాంకు ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు వెలువడనున్నాయి.
కేవలం టోల్ మాత్రమే కాకుండా, ఇకపై పలు రకాల సేవలన్నింటికీ ఫాస్టాగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొట్టిన తర్వాత ఫాస్టాగ్ ద్వారా నగదు కట్ అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనదారుల కోసం ఛార్జింగ్ స్టేషన్ల వద్ద సులభంగా బిల్లు చెల్లించవచ్చు. ఇప్పటికే కొన్ని మాల్స్‌లో ఇది అందుబాటులో ఉండగా, త్వరలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రదేశాల్లోని పార్కింగ్ ఏరియాల్లో కూడా ఫాస్టాగ్ పనిచేస్తుంది. ప్రయాణాల సమయంలో హైవే పక్కన ఉండే ఫుడ్ అవుట్‌లెట్లలో కూడా దీనిని వాడవచ్చు. కార్ సర్వీసింగ్ సెంటర్లలో కూడా పేమెంట్స్ చేసే అవకాశం ఉంది.
ఈ విధానం అమలులోకి వస్తే వాహనదారులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్ వద్ద పార్కింగ్ కోసం చిల్లర వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలాగే పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కూడా తగ్గుతాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు వన్ ట్యాగ్ - మెనీ యూజెస్(ఒక్క ట్యాగ్ - అనేక ఉపయోగాలు) అనే నినాదంతో వాహనదారులకు ఇది సరికొత్త డిజిటల్ అనుభూతిని ఇవ్వబోతోంది. డిజిటల్ ఇండియా దిశగా ఇదొక గొప్ప ముందడుగు అని నిపుణులు ప్రశంసిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

