iPhone 13 : ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ .. రూ.11కే ఐఫోన్13,..

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల రూ.11కే ఐఫోన్ 13 అంటూ ఓ ఆఫర్ ప్రకటించింది. 22వ తేదీ రాత్రి 11 గంటలకు ఈ డీల్ ఉంటుందని ముందుగానే తెలిపింది. దీంతో చాలా మంది యూజర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, కాసేపటికే ‘సోల్ట్ అవుట్’, ‘ఔటాఫ్ స్టాక్’ వంటి సందేశాలు కనిపించడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ‘బై’ ఆప్షన్ కనిపించకుండానే తమకు ‘సోల్డ్ ఔట్’ అనే సందేశం కనిపించిందంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్డర్ ప్లేస్ అయినప్పటికీ.. కాసేపటికే క్యాన్సిల్ అయిందంటూ మరికొందరు పోస్ట్ చేశారు. ‘ఇదో పెద్ద స్కామ్. మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్కులపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది’ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే, తమపై సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్న వేళ ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. ఓ ఎక్స్ యూజర్ పోస్ట్‌కు సమాధానం ఇస్తూ.. తాము ముగ్గురు యూజర్లకు ఐఫోన్ 13ని రూ.11కే అందించినట్లు తెలిపింది. ముందుగా క్లిక్ చేసిన వారికే ఈ అవకాశం లభించిందని పేర్కొంది. అంతమాత్రాన నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంలో రోజూ రాత్రి 9 గంటలకు, 11 గంటలకు ఇలాంటి డీల్స్ ఉంటాయంటూ సమాధానం ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com