MG Majestor : లగ్జరీ కార్ల ప్రపంచంలో పెను తుపాను..ఇక టయోటా పని గోవిందా?

MG Majestor : భారతదేశంలో లగ్జరీ ఎస్‌యూవీల మార్కెట్ ఇప్పుడు మరింత వేడెక్కనుంది. టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీనిచ్చేలా MG మోటార్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ మేజెస్టర్‌ను లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఫిబ్రవరి 12, 2026న ఈ భారీ ఎస్‌యూవీ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. 2025 భారత్ మొబిలిటీ షోలో తొలిసారి మెరిసిన ఈ కారు, అప్పటి నుంచి కార్ లవర్స్‌లో భారీ అంచనాలను పెంచేసింది.
ఎంజీ మేజెస్టర్ చూడ్డానికి చాలా గంభీరంగా, ప్రస్తుత ఎంజీ గ్లోస్టర్ కంటే ఎక్కువ స్పోర్టీగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో గ్లోస్-బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన భారీ గ్రిల్, వెర్టికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో 19-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను జోడించాయి. దీని పొడవు 5 మీటర్ల కంటే ఎక్కువ ఉండటంతో రోడ్డుపై దీని ఉనికి చాలా బలంగా ఉంటుంది.
లోపలి భాగంలో మేజెస్టర్ ఒక చిన్న విల్లాను తలపిస్తుంది. ఇందులో 12.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణాన్ని మరింత సుఖమయం చేయడానికి 12-స్పీకర్ల సౌండ్ సిస్టమ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ కోసం మసాజ్ ఫంక్షన్ ఉన్న హీటెడ్/కూల్డ్ సీట్లు అందుబాటులో ఉంటాయి. సేఫ్టీ విషయంలో కూడా ఎంజీ ఎక్కడా తగ్గలేదు. ఇందులో లెవల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
మేజెస్టర్‌లో 2.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 216 BHP పవర్‌ను, 479 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ కారు 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో కూడా లభించనుంది, దీనివల్ల ఆఫ్-రోడింగ్ ప్రియులకు ఇది ఒక మంచి ఆప్షన్ కానుంది. ఫార్చ్యూనర్ కంటే మెరుగైన టెక్నాలజీ, ఎక్కువ స్థలం, లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉండటం మేజెస్టర్ కు ప్లస్ పాయింట్.
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. ఎంజీ మేజెస్టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.39.57 లక్షల నుంచి రూ.44.03 లక్షల మధ్యలో ఉండవచ్చు. ఇది నేరుగా టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్ వంటి దిగ్గజ కార్లతో తలపడనుంది. ఎంజీ గ్లోస్టర్ కంటే ఒక మెట్టు పైన ఉండేలా ఈ కారును డిజైన్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

