FPI Outflow : వరుసగా మూడో నెల.. భారత స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐల భారీ నిష్క్రమణ.

FPI Outflow : వరుసగా మూడో నెల.. భారత స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐల భారీ నిష్క్రమణ.
X

FPI Outflow : భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు సెప్టెంబర్ నెలలో నికర విక్రేతలుగా నిలిచారు. ఈ నెలలో ఏకంగా రూ.23,885 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. డిపాజిటరీ డేటా ప్రకారం.. ఎఫ్‎పీఐలు భారీగా నిష్క్రమించడం ఇది వరుసగా మూడో నెల. అంతకుముందు ఆగస్టులో రూ.34,990 కోట్లు, జూలైలో రూ.17,700 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఏడాది ఇప్పటివరకు (సెప్టెంబర్ వరకు) ఎఫ్‎పీఐలు మార్కెట్ నుంచి మొత్తం రూ.1.58 లక్షల కోట్ల విలువైన షేర్లను ఉపసంహరించుకున్నారు.

మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా హెడ్ హిమాన్షు శ్రీవాస్తవ ప్రకారం, ఈ తాజా అమ్మకాల వెనుక అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అమెరికా భారతదేశంపై 50% సుంకం విధించడం ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. హెచ్-1బీ వీసా ఫీజులలో లక్ష డాలర్లు ఏకకాలంలో పెరగడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. భారతీయ రూపాయి విలువ రికార్డు కనిష్ట స్థాయికి పడిపోవడం వల్ల పెట్టుబడిదారులకు కరెన్సీ పరంగా నష్టం పెరిగింది.

భారతీయ ఈక్విటీల మూల్యాంకనం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎఫ్‎పీఐలు పెట్టుబడుల కోసం తక్కువ ధరల్లో ఉన్న ఇతర ఆసియా మార్కెట్ల వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఎఫ్‎పీఐలు షేర్లు విక్రయిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో పరిస్థితి మెరుగుపడి, మళ్లీ భారత్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏంజెల్ వన్ సీనియర్ ఫండమెంటల్ అనలిస్ట్ వకార్ జావేద్ ఖాన్ ప్రకారం.. తాజా అమ్మకాల తర్వాత ఇప్పుడు మార్కెట్ మూల్యాంకనాలు మరింత సమతుల్యంగా మారాయి. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు వంటి ప్రభుత్వ నిర్ణయాలు, వృద్ధికి అనుకూలమైన ద్రవ్య విధానం వంటి అంశాలు విదేశీ పెట్టుబడిదారుల దృష్టిని మళ్లీ భారతదేశం వైపు ఆకర్షించగలవు.

విదేశీ పెట్టుబడిదారులు విక్రయాలు జరుపుతున్నా, భారత మార్కెట్ మాత్రం పటిష్టంగా నిలబడింది. గ్లోబల్ టెన్షన్లు ఉన్నప్పటికీ, భారత మార్కెట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గలేదనేది మార్కెట్ ప్రదర్శనను చూస్తే అర్థమవుతుంది.

మార్కెట్ ప్రధాన సూచీలు వారం మొత్తం లాభాలతో ముగిశాయి. గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 0.97 శాతం పెరిగి 780.71 పాయింట్లు పెరిగింది. అదే సమయంలో నిఫ్టీ 0.97 శాతం పెరిగి 239.55 పాయింట్లు లాభపడింది. వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం కూడా మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 223.86 పాయింట్ల లాభంతో 81,207.17 వద్ద స్థిరపడింది.

Tags

Next Story