QR Code: క్యూఆర్ కోడ్ కథ.. బార్‌కోడ్, బుల్స్ ఐ నుంచి నేటి క్యూఆర్ వరకు సాగిన ఆసక్తికర ప్రయాణం!

QR Code: క్యూఆర్ కోడ్ కథ.. బార్‌కోడ్, బుల్స్ ఐ నుంచి నేటి క్యూఆర్ వరకు సాగిన ఆసక్తికర ప్రయాణం!
X

QR Code: ప్రస్తుత డిజిటల్ యుగంలో ముఖ్యంగా యూపీఐ వచ్చిన తర్వాత, క్యూఆర్ కోడ్ అనేది భారతీయుల జీవితంలో ఒక భాగమైపోయింది. మనం చేసే ప్రతి పేమెంట్, ప్రతి సమాచార మార్పిడి ఈ చిన్న చదరపు గ్రిడ్ ద్వారానే జరుగుతోంది. అయితే ఈ క్యూఆర్ కోడ్ వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. దాని కంటే ముందు వస్తువుల సమాచారాన్ని అందించడానికి ఉపయోగించిన బార్‌కోడ్ ఎలా పుట్టింది? ఆ పాత బుల్స్ ఐ బార్‌కోడ్ నుంచి ఈ ఆధునిక క్యూఆర్ కోడ్ వరకు సాంకేతిక ప్రయాణం ఎలా సాగింది? వంటి వివరాలు తెలుసుకుందాం.

నేడు దుకాణాల్లో వస్తువుల మీద కనిపించే నిలువు గీతలు,అక్షరాలతో కూడిన యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్ ఆవిష్కర్త అమెరికన్ అయిన నార్మన్ జోసెఫ్ వుడ్‌ల్యాండ్. 1948లో ఫిలడెల్ఫియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు, ఒక కిరాణా దుకాణం యజమాని చెక్అవుట్ సమయంలో వస్తువుల సమాచారాన్ని వేగంగా ఎలా నమోదు చేయాలనే ప్రశ్నతో ఇంజనీరింగ్ కాలేజ్ డీన్‌ను అడిగాడు. ఈ సమస్యే వుడ్‌ల్యాండ్‌కు బార్‌కోడ్‌ను సృష్టించడానికి ప్రేరణ ఇచ్చింది. ఫ్లోరిడా బీచ్‌లో కూర్చుని మార్స్‌ కోడ్ లోని చుక్కలు, గీతలను ఇసుకపై గీస్తూ వుడ్‌ల్యాండ్ దీనిని రూపొందించారు. ఆయన గీసిన మొదటి బార్‌కోడ్ నిలువు గీతలకు బదులుగా గుండ్రంగా బుల్స్ ఐ ఆకారంలో ఉండేది.

వుడ్‌ల్యాండ్ బార్‌కోడ్ ఆలోచన అమలులోకి రావడానికి రెండు దశాబ్దాలు పట్టింది. బార్‌కోడ్‌లను చదవగలిగే సాంకేతికత అభివృద్ధి అయిన తర్వాతే దీని వినియోగం మొదలైంది. వుడ్‌ల్యాండ్ స్వయంగా ఐబీఎం పరిశోధనా బృందంతో కలిసి బార్‌కోడ్‌ను చదవగలిగే లేజర్ స్కానర్‌ను అభివృద్ధి చేశారు. ఈ బార్‌కోడ్‌ను అధికారికంగా యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్ అని పిలిచారు. 1974లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం జరిగింది.

యూపీసీ బార్‌కోడ్‌లో పరిమిత సమాచారం మాత్రమే నిల్వ చేయగలిగే అవకాశం ఉంది. ఒకే వస్తువును ట్రాక్ చేయడానికి జపాన్ ఆటోమొబైల్ కంపెనీలు దాదాపు 10 బార్‌కోడ్‌లను ఉపయోగించాల్సి వచ్చేది. దీంతో ఉత్పత్తి వేగం తగ్గిపోయేది. ఈ సమస్యను పరిష్కరించడానికి జపాన్‌కు చెందిన డెన్సో వేవ్ కంపెనీ ఉద్యోగి మసహిరో హర 1994లో క్యూఆర్ కోడ్ ఆలోచనను కనుగొన్నారు.

జపాన్ ప్రసిద్ధ బోర్డ్ గేమ్ అయిన గో ఆటను ఆడుతున్నప్పుడు, 19x19 గ్రిడ్‌లో నలుపు, తెలుపు రాళ్లను అమర్చడాన్ని చూసి అదే గ్రిడ్ సిస్టమ్‌లో బార్‌కోడ్ కంటే ఎక్కువ సమాచారాన్ని నిల్వ చేయవచ్చని హర గుర్తించారు. క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ అని అర్థం, అంటే వేగంగా సమాచారాన్ని అందించడం. క్యూఆర్ కోడ్ సాంకేతికత ఇంత విస్తృతంగా వాడుకలోకి రావడానికి ప్రధాన కారణం, దీనిని ఆవిష్కరించిన డెన్సో వేవ్ కంపెనీ తీసుకున్న ఒక కీలక నిర్ణయం. డెన్సో వేవ్ కంపెనీ, ఈ క్యూఆర్ కోడ్ టెక్నాలజీ భవిష్యత్తులో ఇంత విస్తృతంగా ఉపయోగపడుతుందని ఊహించలేదు. అందువల్ల, వారు ఈ సాంకేతికతను ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.

కేవలం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే స్కానర్ టెక్నాలజీని మాత్రమే విక్రయించి, కోడ్ టెక్నాలజీపై పేటెంట్ హక్కులు తీసుకోలేదు. ఈ నిర్ణయం వల్లే నేడు ప్రపంచవ్యాప్తంగా క్యూఆర్ కోడ్ ఇంత సులభంగా, ఉచితంగా అందుబాటులో ఉంది.

Tags

Next Story