Silver Prices Crash: చరిత్రలో కనివిని ఎరుగని పతనం..వారంలో రూ.23 వేలు మాయం..వెండికి ఏమైంది?

Silver Prices Crash: చరిత్రలో కనివిని ఎరుగని పతనం..వారంలో రూ.23 వేలు మాయం..వెండికి ఏమైంది?
X

Silver Prices Crash: పసిడి ప్రేమికులకు, వెండి కొనుగోలుదారులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీ తర్వాత నుంచి మార్కెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం వారం రోజుల్లోనే వెండి ధర ఏకంగా 23 వేల రూపాయలకు పైగా తగ్గడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న బలహీన సంకేతాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమయ్యాయి. మంగళవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దాదాపు 2 శాతం మేర క్షీణించాయి.

ఆల్ ఇండియా సరాఫ్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. వెండి ధర కిలోకు 5,000 రూపాయలు తగ్గి ప్రస్తుతం 2,45,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఫిబ్రవరి 12న కిలో వెండి ధర 2,68,500 రూపాయలుగా ఉండేది. అంటే ఆరు రోజుల్లోనే వెండి కొనుగోలుదారులకు దాదాపు 23,500 రూపాయల ఊరట లభించింది. వెండి బాటలోనే బంగారం కూడా పయనించింది. 10 గ్రాముల స్వచ్ఛమైన (99.9%) బంగారం ధర 2,200 రూపాయలు తగ్గి 1,57,000 రూపాయలకు చేరుకుంది. గత సెషన్‌లో ఇది 1,59,200 రూపాయల వద్ద ఉండటం గమనార్హం.

ధరలు తగ్గడానికి అసలు కారణాలేంటి?

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి కొన్ని కీలక కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చైనా సెలవులు: చైనాలో చంద్ర నూతన సంవత్సరం సెలవుల కారణంగా ఆ దేశం నుంచి డిమాండ్ తగ్గింది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల్లో చైనా ఒకటి కావడంతో ఆ ప్రభావం ధరలపై పడింది.

అమెరికా-ఇరాన్ చర్చలు: జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య జరగనున్న కీలక చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఫలితంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.

వడ్డీ రేట్ల అంచనాలు: అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే నమ్మకం పెరిగింది. దీనివల్ల డాలర్ విలువలో మార్పులు వచ్చి లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.

రష్యా-ఉక్రెయిన్ పరిణామాలు: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా నేతృత్వంలో జరుగుతున్న చర్చలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

మున్ముందు ధరలు ఎలా ఉండబోతున్నాయి?

హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతానికి మార్కెట్‌లో లిక్విడిటీ తక్కువగా ఉంది. సమీప భవిష్యత్తులో ధరలు ఒక పరిమిత పరిధిలో కదలాడే అవకాశం ఉంది. అమెరికా ఉపాధి నివేదికలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు తదుపరి ధరలను నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, భారీగా తగ్గిన ఈ ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనేందుకు మంచి అవకాశంగా కనిపిస్తోంది.

Tags

Next Story