Gold Import : బంగారం దిగుమతిలో భారీ క్షీణత..ఏకంగా 60% తగ్గుదల..కారణం ఇదే.

Gold Import : బంగారం దిగుమతిలో భారీ క్షీణత..ఏకంగా 60% తగ్గుదల..కారణం ఇదే.
X

Gold Import : గత అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతి చేసుకున్న తరువాత నవంబర్ నెలలో ఊహించని విధంగా బంగారం దిగుమతిలో 60 శాతం భారీ క్షీణత నమోదైంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. నవంబర్ 2024లో $9.8 బిలియన్లుగా ఉన్న బంగారం దిగుమతి, నవంబర్ 2025లో $4 బిలియన్లకు తగ్గింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం బంగారం ధరలు నిరంతరంగా పెరగడమే అని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో 10 గ్రాముల బంగారం ధర రూ.1.37 లక్షలకు పైగా ఉంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-నవంబర్)లో మొత్తం బంగారం దిగుమతి మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే 3.3% పెరిగి $45.26 బిలియన్లకు చేరుకుంది.

బంగారం దిగుమతిలో వచ్చిన ఈ భారీ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట కలిగించింది. ముఖ్యంగా దేశ వాణిజ్య లోటు, అంటే దిగుమతి ఎగుమతుల మధ్య వ్యత్యాసం, తగ్గడానికి ఇది సహాయపడింది. నవంబర్ నెలలో వాణిజ్య లోటు ఐదు నెలల కనిష్ట స్థాయికి ($24.53 బిలియన్లు) చేరింది. వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకారం.. దిగుమతి తగ్గడం వల్ల దేశం ఇంపోర్ట్ బిల్లు తగ్గింది. మరోవై ఇదే నవంబర్‌లో అమెరికాకు మన ఎగుమతులు పెరిగాయి, ఇది గత 10 సంవత్సరాల రికార్డును కూడా బద్దలు కొట్టింది. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగించే దేశం భారత్ కాగా, మన దేశానికి దాదాపు 40% బంగారం స్విట్జర్లాండ్ నుంచే దిగుమతి అవుతుంది.

బంగారం దిగుమతి తగ్గినప్పటికీ వెండి దిగుమతి మాత్రం ఊహించని విధంగా 125.40 శాతం పెరిగి నవంబర్ 2025లో $1.07 బిలియన్లకు చేరుకుంది. వెండికి పారిశ్రామికంగా అధిక డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మా వంటి రంగాలలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. వెండికి ఉన్న పారిశ్రామిక అనువర్తనాల కారణంగానే దిగుమతులు పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే, సర్వీస్ ఎగుమతుల పెరుగుదల కారణంగా, ఏప్రిల్-జూన్ 2025-26 కాలంలో దేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD) కూడా జీడీపీలో 0.2%కి ($2.4 బిలియన్లు) తగ్గింది, ఇది గత సంవత్సరం 0.9% ($8.6 బిలియన్లు) ఉండేది.

Tags

Next Story