Gold Loan Rules Change : తాకట్టు పెడితే బంగారం రావడం కష్టమే..బ్యాంకుల కొత్త రూల్స్ తో గుండె గుభేల్

Gold Loan Rules Change : తాకట్టు పెడితే బంగారం రావడం కష్టమే..బ్యాంకుల కొత్త రూల్స్ తో గుండె గుభేల్
X

Gold Loan Rules Change : అవసరానికి ఆదుకునే ఆపద్బాంధవుడు..ఇంట్లో ఉండే పసిడి ఆభరణాలే.. అత్యవసరంగా నగదు కావాల్సి వచ్చినప్పుడు చాలామంది బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు. కానీ ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి బ్యాంకులు షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి. ఇకపై మీ బంగారానికి గతంలో వచ్చినంత సొమ్ము రాకపోవచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ హెచ్చరికల నేపథ్యంలో.. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేశాయి. దీనివల్ల లోన్ అమౌంట్ గణనీయంగా తగ్గిపోనుంది.

బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం బంగారం ధరల్లో కనిపిస్తున్న విపరీతమైన హెచ్చుతగ్గులు. బులియన్ మార్కెట్లో అస్థిరత వల్ల బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ గతంలోనే హెచ్చరించింది. సాధారణంగా మీ బంగారు ఆభరణాల విలువలో 70 నుండి 72 శాతం వరకు బ్యాంకులు లోన్ (Loan to Value) ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిమితిని 60 నుండి 65 శాతానికి తగ్గించేశాయి. అంటే గతంలో లక్ష రూపాయల విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే మీకు రూ.72 వేల వరకు వచ్చేవి, కానీ ఇప్పుడు కేవలం రూ.60 వేల నుండి రూ.65 వేలు మాత్రమే లభిస్తాయి. రిస్క్ తగ్గించుకోవడానికే బ్యాంకులు ఈ సేఫ్ గేమ్ ఆడుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎంసీఎక్స్‎లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.31 లక్షల వరకు పలుకుతోంది. అయితే, భవిష్యత్తులో ఒకవేళ బంగారం ధరలు 10 నుండి 15 శాతం వరకు పడిపోతే పరిస్థితి ఏంటన్నది బ్యాంకుల ఆందోళన. ధరలు పడిపోయినప్పుడు, తాకట్టు పెట్టిన బంగారం విలువ కంటే బాకీ ఉన్న లోన్ అమౌంట్ ఎక్కువైతే.. కస్టమర్లు లోన్ కట్టకుండా చేతులెత్తేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే బ్యాంకుల ఆస్తుల నాణ్యత దెబ్బతింటుంది. అందుకే ముందుజాగ్రత్తగా లోన్ అమౌంట్‌ను తగ్గించి ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గోల్డ్ లోన్లు తీసుకుంటున్న వారిలో యువత సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా 21 నుండి 30 ఏళ్ల లోపు యువకులు గోల్డ్ లోన్ తీసుకోవడం 2021 నుండి రెట్టింపు అయ్యింది. మొత్తం గోల్డ్ లోన్లలో 31-40 ఏళ్ల వారి వాటా 45 శాతంగా ఉంది. ఈ డబ్బును వ్యాపారాల్లో లేదా ఆస్తుల సృష్టికి వాడకుండా, రోజువారీ ఖర్చులకు ఎక్కువగా వాడుతుండటం ఆందోళన కలిగించే అంశం. అక్టోబర్ 2025 నాటికి గోల్డ్ లోన్ మార్కెట్ రూ. 3.37 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ఇంతటి భారీ వృద్ధి తర్వాత, ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా ఉండటానికి ఇండస్ట్రీ ఇప్పుడు దూకుడు తగ్గించి స్థిరత్వం వైపు మొగ్గు చూపుతోంది.

Tags

Next Story