Gold Price : పసిడి పరుగు.. వెండి హోరు.. ఒక్క రోజే రూ.5,800 పెరిగిన బంగారం.

Gold Price : పసిడి పరుగు.. వెండి హోరు.. ఒక్క రోజే రూ.5,800 పెరిగిన బంగారం.
X

Gold Price : పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ మరణం, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. దీని ప్రభావం సోమవారం భారతీయ కమోడిటీ మార్కెట్ పై స్పష్టంగా కనిపించింది. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఏకంగా 3.5 శాతం మేర పెరిగి సరికొత్త రికార్డులను సృష్టించాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేకపోవడంతో, రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఊహించని స్థాయికి చేరుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎంసీఎక్స్ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2026 గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.5,811 పెరిగి రూ.1,67,915 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా అదే బాటలో పయనిస్తూ కిలోకు రూ.9,492 పెరిగి రూ.2,84,490 వద్దకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఒక శాతం పెరిగి ఔన్సు‌కు 5,329 డాలర్లకు చేరుకుంది. ఇది గత నాలుగు వారాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. వెండి కూడా 95 డాలర్ల మార్కును దాటేసింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారే కొద్దీ, పసిడి ధరలు సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తూనే ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, భారత్‌లో త్వరలోనే తులం బంగారం ధర రూ.2,00,000 మార్కును తాకడం ఖాయమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రముఖ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధర 6,000 డాలర్ల దిశగా వెళ్లే అవకాశం ఉందని, వెండి కూడా 100 డాలర్ల మైలురాయిని దాటవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే బంగారం విలువ 20 శాతానికి పైగా పెరిగింది. యుద్ధంతో పాటు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు కూడా ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

సాధారణ ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉన్నందున, స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడింగ్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. ప్రస్తుతం బంగారానికి రూ.1,60,600 వద్ద బలమైన సపోర్ట్ ఉండగా, రూ.1,67,000 వద్ద రెసిస్టెన్స్ కనిపిస్తోంది. యుద్ధం ముదిరితే మాత్రం ఈ ధరలు నియంత్రణ లేకుండా పెరిగిపోయే ప్రమాదం ఉంది. సామాన్య ప్రజలు కూడా పెరుగుతున్న ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ భారం మరింత పెరగనుందని మార్కెట్ వర్గాల విశ్లేషణ.

Tags

Next Story