Gold Price : వచ్చే ఏడాది బంగారం ధర ఔన్స్‌కు $5,000 డాలర్లకు చేరే అవకాశం..ఇండియాలో ఎంత?

Gold Price : బంగారం ధర ఒకటి, రెండేళ్లుగా ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతోంది. ముఖ్యంగా గత ఒక్క సంవత్సరంలోనే బంగారం ధర దాదాపు 50% పెరిగింది. గత రెండు వారాలుగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇప్పుడు బంగారం ధర మళ్లీ పెరుగుదల బాట పట్టింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల పెట్టుబడిదారులు మళ్లీ బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే పసుపు లోహం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు $4,175 డాలర్ల వద్ద ఉంది. ఈ సంవత్సరంలోనే బంగారం ధర మొదటిసారిగా $4,000 డాలర్ల మార్కును దాటింది. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, వచ్చే ఏడాది బంగారం ధర ఔన్స్‌కు $5,000 డాలర్ల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం.. 2026లో బంగారం సగటు ధర ఔన్స్‌కు $4,538 డాలర్లు ఉండవచ్చు.
అమెరికా ప్రభుత్వ అప్పులు, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగడం, వడ్డీ రేట్లు తగ్గడం వంటి అంశాలు బంగారానికి డిమాండ్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. సాధారణంగా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు.
భారతదేశంలో ధర ఎంత పెరుగుతుంది?
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగితే దాని ప్రభావం కచ్చితంగా భారతదేశంలో కూడా ఉంటుంది. నిపుణుల అంచనాల ప్రకారం.. 2026లో ఔన్స్‌కు $5,000 డాలర్ల లెక్కన చూస్తే, భారత్‌లో ధర ఈ విధంగా ఉండవచ్చు. ఒక ఔన్స్ సుమారు 28.35 గ్రాములకు సమానం. ఈ లెక్కన చూస్తే, 2026లో ఒక గ్రాము బంగారం ధర సులభంగా రూ.15,000 నుంచి రూ.16,000 వరకు పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారతదేశంలో గ్రాము బంగారం ధర సుమారు రూ.12,700 ఉంది. అంటే, వచ్చే సంవత్సరంలో గ్రాముకు రూ.3,000 వరకు ధర పెరగవచ్చు. 10 గ్రాముల బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే, వచ్చే ఏడాది రూ.30,000 వరకు అదనంగా చెల్లించాల్సి రావొచ్చు. బంగారం కొనాలనుకునేవారు ఈ ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

