Gold Price : కుప్పకూలిన పసిడి సామ్రాజ్యం.. 72 గంటల్లోనే పసిడి రూ.30 వేలు, వెండి రూ.1.44లక్షల తగ్గుదల.

Gold Price : బంగారం, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే (72 గంటల్లో) వెండి ధర ఏకంగా రూ.1,44,500 మేర కుప్పకూలితే, బంగారం ధర ప్రతి 10 గ్రాములకు రూ.30,300 తగ్గింది. జనవరి 29న రికార్డు స్థాయికి చేరిన ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు షాక్‌కు గురవుతున్నారు. అమెరికా ఆర్థిక విధానాల్లో మార్పులు, డాలర్ బలోపేతం కావడం వంటి కారణాలతో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ క్రాష్ చోటుచేసుకుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆల్ ఇండియా సరాఫ్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. వెండి ధరల్లో ఊహించని పతనం నమోదైంది. జనవరి 29న కిలో వెండి ధర గరిష్టంగా రూ.4,04,500 పలకగా, కేవలం మూడు సెషన్లలో అది రూ.2,60,000 కు పడిపోయింది. అంటే ఏకంగా 36 శాతం విలువ తగ్గింది. కేవలం శనివారం ఒక్కరోజే రూ.72,500 మేర ధర తగ్గడం వెండి చరిత్రలోనే అతిపెద్ద పతనంగా నిలిచింది. దేశీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి దీనికి ప్రధాన కారణం.
బంగారం ధరల పరిస్థితి కూడా అలాగే ఉంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర ప్రతి 10 గ్రాములకు రూ.1,83,000 వద్ద శిఖరాగ్రానికి చేరింది. అయితే, లాభాల స్వీకరణ మొదలవడంతో, అది ఇప్పుడు రూ.1,52,700 వద్ద స్థిరపడింది. మూడు రోజుల్లోనే దాదాపు రూ.30,300 లేదా 17 శాతం మేర ధర తగ్గింది. భారీ ధరల వద్ద ఇన్వెస్టర్లు తమ బంగారాన్ని అమ్మి లాభాలను వెనక్కి తీసుకోవడంతో ధరలు వేగంగా కిందకు దిగివస్తున్నాయి.
ఈ భారీ పతనానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ పేరు తెరపైకి రావడం. ఆయన విధానాలు కఠినంగా ఉంటాయన్న అంచనాలతో డాలర్ బలపడింది. రెండోది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ చర్చల వల్ల డాలర్ విలువ పెరగడం. మూడోది, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గడం వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన గోల్డ్ నుంచి నిధులను మళ్లించి ఇతర మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు.
కేంద్ర బడ్జెట్ 2026-27లో బంగారం, వెండిపై దిగుమతి సుంకంలో మార్పులు ఉండవచ్చని మార్కెట్ భావించింది. కానీ ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయకపోవడంతో ధరలకు స్వల్పకాలిక మద్దతు లభించలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర 1.72 శాతం తగ్గి 4,781 డాలర్ల వద్ద ఉండగా, వెండి 1.42 శాతం తగ్గి 83.49 డాలర్ల వద్ద ఉంది. రాబోయే రోజుల్లో అమెరికా నిరుద్యోగిత గణాంకాలు, ఫెడ్ అధికారుల ప్రసంగాలు మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
