Gold Price : మూడు రోజుల పతనం తర్వాత పసిడి పరుగు..ఒక్కరోజే రూ.6,000 జంప్.

Gold Price : మూడు రోజుల పతనం తర్వాత పసిడి పరుగు..ఒక్కరోజే రూ.6,000 జంప్.
X

Gold Price : గత మూడు రోజులుగా కుప్పకూలిన పసిడి మార్కెట్ ఒక్కసారిగా జూలు విదిల్చింది. కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకునే లోపే బంగారం, వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో 2008 తర్వాత అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత ఒకే రోజు ఇంతటి భారీ స్థాయి పెరుగుదల నమోదు కావడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. బుధవారం నాటి మార్కెట్ అప్‌డేట్స్ ప్రకారం..దేశీయంగా,అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు అసాధారణ స్థాయిలో పుంజుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని సర్రాఫా బజార్‌లో 10 గ్రాముల బంగారం (99.9% స్వచ్ఛత) ధర సోమవారంతో పోలిస్తే ఏకంగా రూ.5,000 పెరిగి రూ.1,57,700 కి చేరుకుంది. గత మూడు రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టడంతో లాభాల స్వీకరణకు దిగిన ఇన్వెస్టర్లు, ఇప్పుడు మళ్లీ తక్కువ ధర వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమైంది. జనవరి 29న నమోదైన ఆల్-టైమ్ హై రూ.1,83,000 నుంచి దాదాపు 17 శాతం తగ్గిన తర్వాత ఇప్పుడు మళ్లీ రికార్డుల దిశగా పయనిస్తోంది.

హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.6,150 పెరిగి రూ.1,58,850 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల (ఆభరణాల) బంగారం ధర కూడా అదే ధాటిగా పెరిగింది. 10 గ్రాములకు సుమారు రూ.5,650 అదనంగా చేరి ఇప్పుడు రూ.1,45,600 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటి వరకు తగ్గుదల చూసి సంతోషించిన కొనుగోలుదారులకు ఈ అకస్మాత్తు పెరుగుదల భారీ షాక్‌ని ఇచ్చింది. వెండి ధరలు అయితే రికార్డులను తిరగరాస్తున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధరపై ఏకంగా రూ.24,000 పెరగడంతో ఇప్పుడు కిలో వెండి ధర రూ.2,84,000కు చేరింది.

వెండి ధరలు అయితే ఊహకందని రీతిలో పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.24,000 లేదా 9.23 శాతం పెరిగి రూ.2,84,000 వద్ద నిలిచింది. సోమవారం నాడు ఏకంగా రూ.52,000 కుప్పకూలిన వెండి, ఇప్పుడు మళ్లీ అదే వేగంతో రికవరీ అవ్వడం మార్కెట్ అస్థిరతకు నిదర్శనం. దేశీయ కమోడిటీ మార్కెట్ (MCX) లో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎంసీఎక్స్ లో బంగారం ధర గరిష్టంగా రూ.9,815 పెరిగి రూ.1,53,806 కు చేరగా, వెండి ధర గరిష్టంగా రూ.40,739 పెరిగి రూ.2,78,000 మార్కును తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి 2008 నాటి ఆర్థిక సంక్షోభం తర్వాతి రోజులను గుర్తు చేస్తోంది. అమెరికన్ మార్కెట్లో గోల్డ్ స్పాట్ ధర ఒకే రోజు సుమారు 6 శాతం (275 డాలర్లు) పెరిగి 4,935.49 డాలర్లకు చేరుకుంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలో జాప్యం చేయవచ్చనే వార్తలు, మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్ళించాయి. దీంతో పాటు చైనా మార్కెట్లో నూతన సంవత్సర వేడుకల ముందు జరుగుతున్న కొనుగోళ్లు కూడా ధరలకు రెక్కలు తెచ్చాయి.

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ భారీ హెచ్చుతగ్గులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడానికి వేచి ఉన్నవారు ఇప్పుడు రంగంలోకి దిగడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే అమెరికా ఉపాధి నివేదిక వెలువడే వరకు ఈ ఒడిదుడుకులు తప్పవని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు చెబుతున్నారు. సామాన్యులు శుభకార్యాల కోసం బంగారం కొనాలంటే ప్రస్తుత ధరల అస్థిరత పెద్ద సవాలుగా మారింది.

Tags

Next Story