Gold Price Today : నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు కొండెక్కిన పసిడి.. సామాన్యుడికి అందని ద్రాక్షలా బంగారం.

Gold Price Today : నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు కొండెక్కిన పసిడి.. సామాన్యుడికి అందని ద్రాక్షలా బంగారం.
X

Gold Price Today : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను వణికిస్తుంటే, ఆ సెగ ఇప్పుడు నేరుగా పసిడి మార్కెట్‌కు తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి తప్పుకుని సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. దీని ప్రభావంతో నేడు, మార్చి 6, 2026న బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకాయి. నిన్నటి వరకు కొంత శాంతించినట్టు కనిపించిన మార్కెట్, నేడు ఒక్కసారిగా భగ్గుమంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‎లో నేడు పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. నిన్నటితో పోలిస్తే ఏకంగా 1,302 రూపాయల భారీ పెరుగుదలతో 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,975.00 వద్ద ట్రేడవుతోంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. కిలో వెండి ధర ఏకంగా 5,631 రూపాయలు పెరిగి, రూ.2,67,822.00 అనే భారీ ధరకు చేరుకుంది. సామాన్యులు కనీసం వెండి వైపు చూడాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పసిడి మెరుపులు పెరిగాయి. కామెక్స్‎లో బంగారం ఔన్సు ధర 5,137 డాలర్లు దాటగా, వెండి 84 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

నిజానికి నిన్నటి (గురువారం) వరకు పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉండేది. ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం, గురువారం బంగారం ధర దాదాపు 1,962 రూపాయలు తగ్గింది. అప్పుడు తులం బంగారం ధర రూ.1,60,586 వద్ద ఉండేది. వెండి కూడా నిన్న రూ.7,135 తగ్గి కిలో రూ.2,64,212 వద్ద ముగిసింది. అయితే, కేవలం 24 గంటల్లోనే యుద్ధం మరింత ముదరడం, గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో మార్కెట్ ఒక్కసారిగా రివర్స్ అయింది. నిన్న తగ్గిన రేట్లను చూసి సంతోషించిన వారు, నేటి ధరలు చూసి షాక్‌కు గురవుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య కొనుగోలుదారులు, పెళ్లిళ్ల కోసం నగలు చేయించుకోవాలనుకునే కుటుంబాలు తీవ్ర అయోమయంలో ఉన్నారు. బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో, ఎప్పుడు తగ్గుతున్నాయో అర్థం కాని పరిస్థితి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, యుద్ధం ఎంత కాలం కొనసాగితే బంగారం ధరలు అంతలా పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ దేశాల మధ్య చర్చలు సఫలమై శాంతి నెలకొంటే తప్ప ధరలు దిగివచ్చే అవకాశం లేదు. కాబట్టి, ప్రస్తుతానికి మార్కెట్ పూర్తిగా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే వార్తలపైనే ఆధారపడి ఉంది. అత్యవసరమైతే తప్ప ఈ గందరగోళ సమయంలో భారీ పెట్టుబడులు పెట్టడం కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే.

Tags

Next Story