Gold Price : కేజీ వెండి రూ.7లక్షలు..తులం బంగారం రూ.3లక్షలు..ధరలు చూస్తే పిచ్చెక్కాల్సిందే.

Gold Price : కేజీ వెండి రూ.7లక్షలు..తులం బంగారం రూ.3లక్షలు..ధరలు చూస్తే పిచ్చెక్కాల్సిందే.
X

Gold Price : బంగారం, వెండి అంటే భారతీయులకు ఎప్పుడూ అమితమైన ఇష్టమే. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలను చూసి ఇప్పటికే సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఒక తాజా అంచనా వింటే మాత్రం మీ కాళ్ళ కింద భూమి కదలడం ఖాయం. కెనడాకు చెందిన ప్రముఖ బ్యాంక్ BMO క్యాపిటల్ మార్కెట్స్ బంగారం ధరలపై సంచలన జోస్యం చెప్పింది. రాబోయే రెండేళ్లలో బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటాయని ఈ రిపోర్ట్ పేర్కొంది.

కెనడాకు చెందిన ప్రతిష్టాత్మక బ్యాంక్ BMO క్యాపిటల్ మార్కెట్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2027 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక ఔన్స్‌కు 8,650 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే వెండి ధర కూడా ఊహించని విధంగా ఔన్స్‌కు 220 డాలర్లకు చేరుతుందని బ్యాంక్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంచనాలను భారతీయ కరెన్సీలోకి మార్చి లెక్కిస్తే.. 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.2.83 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండవచ్చు. అదే సమయంలో కిలో వెండి ధర ఏకంగా రూ.7.20 లక్షల మార్కును తాకవచ్చు.

ధరలు ఇంతలా పెరగడానికి కారణమేంటి?

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అస్థిరతలే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. సెల్ అమెరికా అనే ట్రెండ్ మొదలైందని, అంటే అమెరికన్ డాలర్, అక్కడి బాండ్ మార్కెట్ క్రమంగా బలహీనపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగితపు కరెన్సీపై ఇన్వెస్టర్లకు నమ్మకం తగ్గుతుండటంతో, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. జపనీస్ యెన్ విలువలో ఒడిదుడుకులు, గ్లోబల్ రిస్క్ ఎన్విరాన్‌మెంట్ కూడా పసిడికి రెక్కలు తొడుగుతున్నాయి.

వెండి రికార్డుల వేట

చాలా కాలంగా బంగారం నీడలో ఉన్న వెండి, రాబోయే రోజుల్లో బంగారం కంటే వేగంగా పుంజుకుంటుందని BMO స్పష్టం చేసింది. ప్రస్తుతం బంగారం-వెండి నిష్పత్తి 50 కంటే తక్కువకు పడిపోయింది. అంటే బంగారం కంటే వెండి పనితీరు మెరుగ్గా ఉంది. 2026 చివరి నాటికి వెండి ఔన్స్‌కు 160 డాలర్లకు, 2027 నాటికి 220 డాలర్లకు చేరుతుందని బ్యాంక్ అంచనా వేసింది. ఇది గనుక నిజమైతే వెండి ధర చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయికి చేరుతుంది.

షరతులు వర్తిస్తాయి

అయితే ఈ భారీ ధరలు కేవలం కొన్ని పరిస్థితులపైనే ఆధారపడి ఉంటాయని బ్యాంక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ప్రతి త్రైమాసికంలో కనీసం 8 మిలియన్ ఔన్ల బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండాలి. అలాగే గోల్డ్ ఈటీఎఫ్‎లలో కూడా భారీగా పెట్టుబడులు రావాలి. అమెరికన్ డాలర్ బలహీనపడటం కొనసాగితేనే ఈ మ్యాజికల్ ఫిగర్స్ సాధ్యమవుతాయని నివేదిక హెచ్చరించింది. ఏది ఏమైనా, ఈ అంచనాలు ఇప్పుడు పెట్టుబడిదారులలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Tags

Next Story