Gold Price : బంగారం లక్షన్నర.. వెండి రెండు లక్షలు.. ఇప్పుడే కొనకపోతే ఇక కలలు కనాల్సిందే

Gold Price : బంగారం లక్షన్నర.. వెండి రెండు లక్షలు.. ఇప్పుడే కొనకపోతే ఇక కలలు కనాల్సిందే
X

Gold Price : పెట్టుబడిదారులకు 2025 సంవత్సరం ఒక పండగలా సాగింది. ముఖ్యంగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగి కొత్త రికార్డులను సృష్టించాయి. షేర్ మార్కెట్ (నిఫ్టీ 50) కేవలం 10.18 శాతం రిటర్న్స్ ఇస్తే.. పసిడి, వెండి మాత్రం ఊహించని లాభాలను పంచాయి. గతేడాది డిసెంబర్‌లో రూ.75,233 ఉన్న 10 గ్రాముల బంగారం ధర, ఇప్పుడు ఏకంగా రూ.1,33,589కి చేరింది. ఇక వెండి అయితే ఏకంగా 144 శాతం పెరిగి రూ.2,08,062 వద్ద నిలిచింది. మరి 2026లో కూడా ఇదే హవా కొనసాగుతుందా? బంగారం మెరుస్తుందా లేక వెండి మెరిపిస్తుందా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

ధరల పెరుగుదలకు కారణాలేంటి?

ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (యుద్ధ వాతావరణం), అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. వెండి విషయానికొస్తే.. కేవలం ఆభరణాల కోసమే కాకుండా, ఇండస్ట్రియల్ రంగంలో (సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్) డిమాండ్ పెరగడం వల్ల వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. 2026లో కూడా ఈ డిమాండ్ ఇలాగే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2026లో ఎంత పెరగొచ్చు?

నిపుణుల అంచనా ప్రకారం.. వచ్చే ఏడాది బంగారం ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.65 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. వెండి మరింత దూకుడు ప్రదర్శిస్తూ రూ.2.30 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. 2026 చివరి నాటికి బంగారం ధరలు సానుకూలంగానే ఉన్నా, వెండిలో మాత్రం భారీగా లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. పెట్టుబడి పరంగా చూస్తే, బంగారం స్థిరత్వాన్ని ఇస్తుంది, వెండి మాత్రం వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.

ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఎలా చేయాలి?

పెట్టుబడిదారులు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం కంటే SIP ద్వారా ప్రతి నెలా కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం పోర్ట్‌ఫోలియోను స్థిరంగా ఉంచుతుంది కాబట్టి అందులో రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయాలి. వెండిలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వెండి ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం లేదా ఎస్ఐపి ద్వారా దీర్ఘకాలం పాటు కొనసాగించడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు.

గోల్డ్-సిల్వర్ రేషియో ఏం చెబుతోంది?

బంగారం, వెండి మధ్య ఉండే సంబంధాన్ని గోల్డ్-సిల్వర్ రేషియో ద్వారా లెక్కిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇది 87 వద్ద ఉండగా, ఇప్పుడు అది 64.70కి పడిపోయింది. అంటే బంగారం కంటే వెండి ధరలు చాలా వేగంగా పెరిగాయని అర్థం. గత చరిత్రను పరిశీలిస్తే ఈ రేషియో ఇంకా తగ్గే అవకాశం ఉందని, తద్వారా వెండి ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి 2026లో కూడా ఈ విలువైన లోహాల మీద పెట్టుబడి పెట్టడం ఒక సురక్షితమైన మార్గమని చెప్పవచ్చు.

Tags

Next Story