UPI : బ్యాంకింగ్ రంగంలో పెను సంచలనం.. యూపీఐ ఛార్జీల భయం ఇక పటాపంచలు.

UPI : ప్రస్తుత డిజిటల్ యుగంలో టీ కొట్టు దగ్గర నుంచిపెద్ద షోరూమ్ వరకు అంతా యూపీఐ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఏదీ ఉచితంగా రాదు అని గతంలో ఆర్‌బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో యూపీఐపై ఛార్జీలు వస్తాయని అందరూ భయపడ్డారు. ఈ అనుమానాలపై కేంద్రం బడ్జెట్ ద్వారా స్పష్టత ఇచ్చింది. యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2,000 కోట్ల సబ్సిడీని ప్రకటించింది. దీనివల్ల బ్యాంకులు వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయనవసరం లేదు.
యూపీఐ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాల భయం కూడా వెంటాడుతోంది. అయితే, ఆర్థిక సేవల కార్యదర్శి ఎం. నాగరాజు దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల లోపాల వల్ల జరిగే సైబర్ మోసాలు కేవలం 3 శాతం కంటే తక్కువ అని, మిగిలినవన్నీ ప్రజల అప్రమత్తత లేకపోవడం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. పిన్ లేదా ఓటిపి పంచుకోకుండా జాగ్రత్తగా ఉంటే యూపీఐ అత్యంత సురక్షితమైన మార్గమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల్లో నేరుగా విదేశీ పెట్టుబడుల పరిమితి 20 శాతంగా ఉంది. దీనిని 49 శాతానికి పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయని నాగరాజు తెలిపారు. దీనివల్ల బ్యాంకుల్లో పెట్టుబడులు పెరిగి, అవి మరింత ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించగలవు. ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ పరిమితి 74 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.
రాబోయే రోజుల్లో దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చేందుకు బ్యాంకులకు పెద్ద పీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం బడ్జెట్‌లో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ కమిటీ బ్యాంకింగ్ రంగంలో చేయాల్సిన సంస్కరణలు, భవిష్యత్తు సవాళ్లపై ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేస్తుంది. ప్రస్తుతం బ్యాంకుల పరిస్థితి మెరుగ్గా ఉందని, నిరర్థక ఆస్తులు తగ్గాయని, లాభాలు పెరిగాయని ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
