Cigarette Tax : సిగరెట్లపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్..ఐటీసీకి రూ.50,000 కోట్ల భారీ దెబ్బ.

Cigarette Tax : సిగరెట్లపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్..ఐటీసీకి రూ.50,000 కోట్ల భారీ దెబ్బ.
X

Cigarette Tax : సిగరెట్ ప్రియులకు, పొగాకు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న సంచలన నిర్ణయం స్టాక్ మార్కెట్‌ను కుదిపేసింది. ఈ కొత్త పన్నుల దెబ్బకు దేశీ దిగ్గజం ఐటీసీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే వేల కోట్లు ఆవిరైపోయింది. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1, 2026 నుంచి ఈ కొత్త పన్నుల విధానం అమల్లోకి రానుంది.

పన్ను పోటు - పెరగనున్న ధరలు

సిగరెట్ పొడవు ఆధారంగా ప్రతి 1,000 స్టిక్స్‌పై రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న తాత్కాలిక పన్నుల స్థానంలో శాశ్వత ఎక్సైజ్ సుంకాన్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉన్న 40 శాతం జీఎస్‌టీకి ఇది అదనం కావడంతో సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఒక్కో సిగరెట్ ధరపై కనీసం రూ.2 నుంచి రూ.3 వరకు భారం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 75 మి.మీ కంటే ఎక్కువ పొడవు ఉండే సిగరెట్ల తయారీ ఖర్చు 28 శాతం వరకు పెరగనుంది.

ఐటీసీ మార్కెట్ క్యాప్ ఆవిరి

ఈ వార్త బయటకు రాగానే దేశంలోని అతిపెద్ద సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ షేర్లు కుప్పకూలాయి. గురువారం ట్రేడింగ్‌లో ఐటీసీ షేరు ఏకంగా 10 శాతం వరకు పడిపోయి ₹362 స్థాయికి చేరింది. దీనివల్ల కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.50,491 కోట్లు క్షీణించింది. ఒక్క రోజులోనే ఇంత భారీ స్థాయిలో నష్టం రావడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. బుధవారం రూ.5.04 లక్షల కోట్లుగా ఉన్న ఐటీసీ వాల్యూయేషన్, గురువారం నాటికి రూ.4.54 లక్షల కోట్లకు పడిపోయింది.

ఇతర కంపెనీల పరిస్థితి దారుణం

కేవలం ఐటీసీ మాత్రమే కాకుండా, మార్ల్‌బోరో సిగరెట్ల డిస్ట్రిబ్యూటర్ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్లు కూడా 19 శాతం వరకు పతనమయ్యాయి. వీఎస్టీ ఇండస్ట్రీస్ వంటి ఇతర పొగాకు కంపెనీల షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ప్రభుత్వం తీసుకున్న సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు 2025 వల్ల సిగరెట్ కంపెనీల లాభాలు దారుణంగా పడిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంలో సుమారు 10 కోట్ల మంది ధూమపానం చేసేవారు ఉన్నారని అంచనా.

డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల దిశగా

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం.. పొగాకు ఉత్పత్తుల ధరలో 75 శాతం పన్ను ఉండాలి. కానీ భారతదేశంలో ఇప్పటికీ పన్నుల శాతం 53 శాతంగానే ఉంది. దీనిని మరింత పెంచి యువతను ధూమపానానికి దూరంగా ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే బడ్జెట్‌లో కూడా పొగాకు ఉత్పత్తులపై మరిన్ని ఆంక్షలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సిగరెట్ కంపెనీలు ఈ అదనపు పన్ను భారాన్ని వినియోగదారులపైకి నెట్టడం తప్ప వేరే మార్గం లేదు. అంటే ఫిబ్రవరి నుంచి దమ్ కొట్టడం మరింత ఖరీదైన వ్యవహారం కానుంది.

Tags

Next Story