Insurance Companies : గుడ్ న్యూస్.. ఆ 3 ప్రభుత్వ బీమా కంపెనీలు ఒక్కటి కాబోతున్నాయా?

Insurance Companies : ప్రభుత్వ బ్యాంకుల విలీనం తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దేశంలోని ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల విలీనంపై దృష్టి సారించింది. ఇందుకోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను సింగిల్ యూనిట్‌గా విలీనం చేసేందుకు సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో వాటి సామర్థ్యాన్ని పెంచడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం.
ప్రభుత్వం విలీనం చేయాలని చూస్తున్న మూడు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. ఈ మూడు కంపెనీలను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడానికి 2019-20 నుంచి 2021-22 మధ్య ప్రభుత్వం మొత్తం రూ. 17,450 కోట్లు పెట్టుబడి పెట్టింది. గతంలో 2018-19 బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మూడు కంపెనీలను ఒకే యూనిట్‌లో కలపాలని ప్రకటించారు. అయితే జూలై 2020లో ప్రభుత్వం ఆ ఆలోచనను వాయిదా వేసి వాటిలో రూ. 12,450 కోట్ల మూలధనాన్ని మంజూరు చేసింది.
ప్రస్తుతం ఈ మూడు కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత వాటి పనితీరు సామర్థ్యాన్ని పెంచడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ విలీన ప్రతిపాదనపై ప్రాథమిక సమీక్ష చేస్తోంది. విలీనం గురించి ఆలోచిస్తున్నప్పటికీ, ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనపైనా ఏకకాలంలో పరిశీలన జరుగుతోంది. ప్రస్తుతానికి ఎలాంటి అంతిమ నిర్ణయం తీసుకోలేదు. వివిధ ప్రత్యామ్నాయాలపై చర్చ కొనసాగుతోంది. 2021-22 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు ప్రభుత్వ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీ ప్రైవేటీకరణతో సహా పెద్ద ప్రైవేటీకరణ అజెండాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీల ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తూ, ఆగస్టు 2021లో పార్లమెంట్ సాధారణ బీమా వ్యాపార (జాతీయీకరణ) సవరణ బిల్లు 2021ను ఆమోదించింది. ఈ సవరణ తర్వాత ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రైవేటీకరణకు చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

