Banking Mega Merger : ఇక మిగిలింది 4 బ్యాంకులు మాత్రమే..నీతి ఆయోగ్ సిఫార్సుతో కేంద్రం భారీ ప్రణాళిక.

Banking Mega Merger : ఇక మిగిలింది 4 బ్యాంకులు మాత్రమే..నీతి ఆయోగ్ సిఫార్సుతో కేంద్రం భారీ ప్రణాళిక.
X

Banking Mega Merger : భారత ప్రభుత్వం దేశ బ్యాంకింగ్ రంగంలో మరోసారి అతిపెద్ద మార్పు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అనేక మీడియా నివేదికల ప్రకారం.. దేశంలోని చిన్న ప్రభుత్వ బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసి, ఒక మెగా స్ట్రక్చర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఈ ప్రతిపాదనపై పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, రాబోయే రోజుల్లో దేశంలో కేవలం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే మిగిలి ఉండే అవకాశం ఉంది. ఈ విలీనం వల్ల ఖాతాదారులు పై ఎలాంటి ప్రభావం పడుతుంది? వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి? తెలుసుకుందాం.

బ్యాంకుల విలీనం వల్ల కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. అయితే, కొన్ని ఇబ్బందులతో పాటు లాభాలు కూడా ఉంటాయి. విలీనం తర్వాత ఖాతాదారులు తమ బ్యాంకు పేరు, IFSC కోడ్, చెక్ బుక్, పాస్‌బుక్ లను మార్చుకోవలసి ఉంటుంది. అకౌంట్ మైగ్రేషన్, డేటా బదిలీ సమయంలో కొంతకాలం పాటు బ్యాంకింగ్ సేవల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. దగ్గర దగ్గరగా ఉన్న రెండు బ్యాంకు శాఖలను కలిపివేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఖాతాదారులు కొంచెం దూరం ప్రయాణించాల్సి రావచ్చు.

పెద్ద బ్యాంకుల్లో భద్రత పెరుగుతుంది. అంతేకాకుండా, మెరుగైన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, మరిన్ని సౌకర్యాలు, పెద్ద బ్యాంకుల స్థిరత్వం లాంటి ప్రయోజనాలు ఖాతాదారులకు లభిస్తాయి. ప్రభుత్వం సాధారణంగా ఈ మార్పులు సాఫీగా జరిగేలా చూస్తుంది.

నివేదికల ప్రకారం, ప్రభుత్వం కొన్ని చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయాలని యోచిస్తోంది.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (BoI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) లోకి వీటిని విలీనం చేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనపై ప్రాథమిక పత్రాలు సిద్ధమయ్యాయని, త్వరలోనే క్యాబినెట్, పీఎంఓకు పంపబడతాయని చెబుతున్నారు. అనుమతి లభిస్తే ఈ మెగా విలీనం ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 లో పూర్తి అయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఈ మార్పు ఎందుకు చేస్తోంది?

ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడం, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశం. చిన్న బ్యాంకుల్లో ఖర్చు పెరగడం, NPA (నిరర్థక ఆస్తులు) పెరగడం, చిన్న బ్యాలెన్స్ షీట్ల కారణంగా పోటీలో వెనుకబడటం వంటి సమస్యలు ఉన్నాయి. బ్యాంకులు దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా, ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా బలంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

ఈ విలీనం వల్ల బ్యాంకులకు అప్పు ఇచ్చే సామర్థ్యం పెరుగుతుంది, బ్యాలెన్స్ షీట్ బలపడుతుంది, టెక్నాలజీ, నిర్వహణ మెరుగుపడుతుంది. గతంలో 2017 నుంచి 2020 మధ్య ప్రభుత్వం 10 బ్యాంకులను కలిపి 4 పెద్ద బ్యాంకులుగా చేసింది. ఈ కొత్త ప్రణాళిక అమలైతే, దేశంలో SBI, PNB, BoB, కెనరా బ్యాంక్ అనే నాలుగు ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే మిగిలి ఉంటాయి.

Tags

Next Story