GST Reforms : లగ్జరీ కార్లపై సెస్ తొలగింపు.. పొగాకు ఉత్పత్తులపై కొనసాగింపు ఎందుకు?

GST Reforms : లగ్జరీ కార్లపై సెస్ తొలగింపు.. పొగాకు ఉత్పత్తులపై కొనసాగింపు ఎందుకు?
X

GST Reforms : పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులు వినియోగించే వారికి ఒక ముఖ్యమైన అప్‌డేట్. ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం జీఎస్టీతో పాటు అదనంగా విధిస్తున్న జీఎస్టీ పరిహార సెస్ గడువును ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి ఈ సెస్ నవంబర్ 2025 వరకు అమలులో ఉండాల్సి ఉండగా, రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం కోసం తీసుకున్న రుణాలు ఇంకా పూర్తి స్థాయిలో తీరకపోవడంతో దీనిని జనవరి 2026 వరకు మరో రెండు నెలలు పొడిగించినట్లు సమాచారం. ఈ సెస్ పొడిగింపునకు సంబంధించిన పూర్తి వివరాలు, జీఎస్టీ సంస్కరణల తర్వాత సెస్ వసూళ్లలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం.

రాష్ట్రాలకు జీఎస్టీ అమలు వల్ల వచ్చిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీని తిరిగి చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి సంబంధిత ఉత్పత్తులపై విధిస్తున్న జీఎస్టీ పరిహార సెస్ గడువును నవంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు పొడిగించారు.

ఫైనాన్షియల్ ఇయర్ 2021 - 2022లో కేంద్రం రాష్ట్రాలకు పరిహారం చెల్లించడానికి తీసుకున్న రూ.2.69 లక్షల కోట్ల రుణాలను, వాటిపై వడ్డీని పూర్తిగా చెల్లించడానికి కొంత సమయం అవసరం. అందుకే ఈ సెస్ అమలు గడువును రెండు నెలలు పెంచారు. సెప్టెంబర్ 22, 2025 నుంచి జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా, జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

సంస్కరణల్లో భాగంగా, లగ్జరీ కార్లు, ఏరేటెడ్ పానీయాలు, బొగ్గు, ఇతర విలాసవంతమైన/హానికరమైన వస్తువులపై ఉన్న జీఎస్టీ పరిహార సెస్ పూర్తిగా తొలగించారు. పలు వస్తువులకు ఈ సెస్ తొలగించి, దానిని 40% కొత్త జీఎస్టీ రేటులో విలీనం చేశారు. సెప్టెంబర్ 3న జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, పాన్ మసాలా, గుట్కా, సిగరెట్, బీడీ వంటి ఉత్పత్తులపై మాత్రం, రుణాల చెల్లింపు పూర్తయ్యే వరకు, జీఎస్టీ, పరిహార సెస్ ప్రస్తుత రేట్ల వద్దే కొనసాగుతాయి.

ఇతర వస్తువులపై సెస్ తొలగించబడిన తర్వాత, సెస్ వసూళ్లలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. సెస్ వసూళ్లు సెప్టెంబర్ 2025లో రూ.11,652 కోట్ల నుంచి అక్టోబర్ 2025లో రూ.7,812 కోట్లకు తగ్గాయి. అంటే, సుమారు 33% క్షీణత నమోదైంది. దీనికి కారణం సెస్ పరిధి కేవలం పొగాకు ఉత్పత్తులకే పరిమితం కావడం.

జనవరి 2026లో పరిహార సెస్ గడువు ముగిసిన తర్వాత కూడా, ఈ పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేక సుంకాన్ని విధించే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇచ్చారు. దీనివల్ల ఈ ఉత్పత్తులపై పన్ను భారం అలాగే కొనసాగుతుంది. సెస్ రద్దు, ప్రత్యేక సుంకంపై తుది నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది.

Tags

Next Story