IDFC Bank Scam : రూ.590 కోట్ల ప్రభుత్వ సొమ్ము గోల్‌మాల్.. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ కేసులో ఏసీబీ యాక్షన్ షురూ.

IDFC Bank Scam : హర్యానాలో సంచలనం సృష్టించిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ భారీ కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ స్కామ్‌కు పాల్పడిన మాస్టర్‌మైండ్ రిభవ్ రిషితో పాటు మరో నలుగురిని యాంటీ కరప్షన్ బ్యూరో మంగళవారం అర్థరాత్రి అరెస్ట్ చేసింది. సుమారు 590 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కాజేసేందుకు పక్కా ప్లాన్ వేసిన ఈ ముఠా గుట్టును ఏసీబీ ఎట్టకేలకు రట్టు చేసింది. వీరిలో ఎంతమంది బ్యాంక్ ఉద్యోగులు, ఎంతమంది బయటి వ్యక్తులు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అయిన రిభవ్ రిషి, గతంలో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం పంజాబ్‌లోని జీరక్‌పూర్‌లో ఉన్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న పట్టుతో, రిభవ్ కొన్ని నకిలీ కంపెనీలను సృష్టించాడు. హర్యానా ప్రభుత్వ విభాగాలకు చెందిన సుమారు 590 కోట్ల రూపాయలను ఆయా ప్రభుత్వ ఖాతాల నుంచి దారి మళ్లించి స్వాహా చేశాడు. రిభవ్ రిషితో పాటు అభిషేక్ సింగ్లా, అభయ్, స్వాతి మరియు మరొకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ భారీ మోసంపై అసెంబ్లీలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవగా, ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ స్పందించారు. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నుంచి వడ్డీతో సహా మొత్తం సొమ్మును రికవరీ చేసినట్లు ఆయన ప్రకటించారు. అయితే, ఈ కేసులో కొంతమంది ఐఏఎస్ అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన కార్యాలయం పంచకులలో ఉన్నప్పటికీ, అధికారులు చండీగఢ్‌లోని బ్యాంకులపై ఎందుకు ఆసక్తి చూపించారనే కోణంలో ఎసిబి దర్యాప్తు చేస్తోంది. దీని వెనుక అధికారులకు ఏమైనా వ్యక్తిగత ప్రయోజనాలు చేకూరాయా అన్నది తేలాల్సి ఉంది.
నిజానికి ఈ గోల్‌మాల్ వ్యవహారం గతేడాది జూలైలోనే ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అప్పట్లో ఆర్థిక శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అన్ని శాఖలకు లేఖ రాసి అప్రమత్తం చేశారు. అయినప్పటికీ, దాదాపు 18 ప్రభుత్వ శాఖల ఖాతాలు చండీగఢ్‌లోని బ్యాంకుల్లోనే కొనసాగాయి. ఇప్పుడు ప్రభుత్వం ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లను ప్రభుత్వ ప్యానెల్‌లో చేర్చడంపై హైలెవల్ విచారణకు ఆదేశించింది. ఈ కుంభకోణం మూలాలు ఇంకా ఎంతవరకు ఉన్నాయనేది ఇప్పుడు హర్యానా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
