Health Insurance Premium : స్మోకింగ్ మానేసినా ప్రీమియం తగ్గదా? ఇది బీమా కంపెనీల కొత్త లెక్క!

Health Insurance Premium : స్మోకింగ్ మానేసినా ప్రీమియం తగ్గదా? ఇది బీమా కంపెనీల కొత్త లెక్క!
X

Health Insurance Premium : హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు బీమా కంపెనీలు మన ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలుసుకోవాలని చూస్తాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నా, లేదా పొగతాగడం , మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్నా ప్రీమియం మొత్తం పెరుగుతుంది. ఎందుకంటే ఈ దురలవాట్లు త్వరగా అనారోగ్యానికి దారి తీస్తాయి. అయితే, ఒక వ్యక్తి స్మోకింగ్ లేదా డ్రింకింగ్ మానేసినా కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం వెంటనే తగ్గదు. దీనికి కారణం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రీమియం తగ్గకపోవడానికి కారణం ఇదే

మీరు స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లను మానేసినంత మాత్రాన ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుందనే గ్యారెంటీ లేదు. చాలా వరకు బీమా కంపెనీలు వెంటనే ప్రీమియాన్ని తగ్గించవు. కొన్ని కంపెనీలు మీరు ఆ అలవాట్లను మానేసిన 2 సంవత్సరాల తర్వాత, మరికొన్ని కంపెనీలు ఐదు లేదా ఆరు సంవత్సరాల తర్వాత తగ్గించవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ దురలవాట్లు శరీరంపై దీర్ఘకాలికంగా, తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.

ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం

పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు మాత్రమే కాక, శరీరంలోని ప్రతీ అవయవంపై దుష్ప్రభావం పడుతుంది. మద్యం కూడా కాలేయాన్ని మాత్రమే కాకుండా ఇతర అవయవాలపైనా ప్రభావం చూపుతుంది. ఈ అలవాట్లను ఇప్పుడు మానేసినా, ముఖ్యంగా 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఈ అలవాట్లు ఉన్నవారికి... ఆ ప్రభావం 20 ఏళ్ల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. బీపీ, షుగర్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఆర్థరైటిస్, లైంగిక సమస్యలు వంటి అనేక సెకండరీ వ్యాధులకు ధూమపానం ప్రధాన కారణంగా ఉంటుంది. అందుకే బీమా కంపెనీలు దీన్ని పెద్ద రిస్క్‌గా పరిగణించి ప్రీమియం తగ్గించడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.

నిజాయితీగా వివరాలు ఇవ్వకపోతే..

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మీ ఆరోగ్య పరిస్థితుల గురించి, గతంలో ఉన్న అలవాట్ల గురించి పూర్తిగా, నిజాయితీగా సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. మీకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కంపెనీలు భావిస్తే, అది వారికి రిస్క్ అవుతుంది కాబట్టి ఎక్కువ ప్రీమియం అడుగుతాయి. ఒకవేళ మీరు మీ అనారోగ్య స్థితి లేదా దురలవాట్లను దాచిపెట్టి పాలసీ తీసుకుంటే, భవిష్యత్తులో సమస్య రావచ్చు. మీరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి క్లెయిమ్ చేసినప్పుడు, బీమా కంపెనీలు అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.

క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణం

మీరు దాచిపెట్టిన ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్ల కారణంగానే మీకు అనారోగ్యం వచ్చిందని కంపెనీ గుర్తిస్తే, మీ క్లెయిమ్‌ను వెంటనే తిరస్కరించవచ్చు. క్లెయిమ్ రిజెక్ట్ అయిన చాలా కేసులలో ఇదే ప్రధాన కారణంగా ఉంటుంది. కాబట్టి పెద్ద నష్టాల నుంచి తప్పించుకోవడానికి అధిక ప్రీమియం కట్టినా పర్వాలేదు కానీ, పాలసీ తీసుకునేటప్పుడు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి.

Tags

Next Story