November Sales : ఒకప్పుడు వేస్ట్ అన్నారు..ఇప్పుడు మార్కెట్లోనే బెస్ట్.. ఓలాకు షాకిచ్చిన హీరో.

November Sales : భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో ఇప్పటి వరకు టీవీఎస్, ఓలా, ఏథర్, బజాజ్ వంటి కంపెనీల ఆధిపత్యం ఉండేది. అయితే ఇప్పుడు హీరో మోటోకార్ప్ కూడా ఈ రంగంలో బలమైన పట్టు సాధించింది. ఏకంగా మార్కెట్ దిగ్గజం ఓలాను కూడా వెనక్కి నెట్టింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ తాజా గణాంకాల ప్రకారం.. నవంబర్ 2025 లో మొత్తం ఎలక్ట్రిక్ టూ-వీలర్ రిటైల్ విక్రయాలలో హీరో మోటోకార్ప్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఓలా అమ్మకాలు ఈ నెలలో బాగా తగ్గడం దీనికి ప్రధాన కారణం.
హీరో అమ్మకాల్లో 66% వృద్ధి
నవంబర్ 2025 లో హీరో మోటోకార్ప్ మొత్తం 12,213 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 7,352 యూనిట్లతో పోలిస్తే ఇది 66.12% అధికం. అయితే, అక్టోబర్ 2025 తో (16,036 యూనిట్లు) పోలిస్తే ఈసారి 3,739 యూనిట్లు తక్కువగా అమ్ముడయ్యాయి. అంటే, నెలవారీగా చూస్తే 23.44% తగ్గుదల నమోదైంది. హీరో ఎలక్ట్రిక్ టూ-వీలర్ అమ్మకాలు వారి VIDA బ్రాండ్ నుంచి వస్తున్నాయి. కంపెనీ ప్రస్తుతం VX2, V2 సిరీస్‌లలో మొత్తం 4 మోడళ్లను విక్రయిస్తోంది. VX2 Go ధర రూ.73,850 నుంచి ప్రారంభమై, V2 Pro ధర రూ.1,40,000 వరకు ఉంది (ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు). ఈ పురోగతితో ఓలా ఇప్పుడు భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఐదో స్థానానికి పడిపోయింది.
ఓలా అమ్మకాలు 71% పతనం
ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి మాత్రం గతంలో ఉన్నంత బాగా లేదు. నవంబర్ 2025 లో ఓలా మొత్తం 8,402 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీని కారణంగా అది హీరో కంటే దిగువకు పడిపోయి, ఐదో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మిన 20,920 యూనిట్లతో పోలిస్తే, ఓలా ఈసారి ఏకంగా 71.35% భారీ పతనాన్ని నమోదు చేసింది. అక్టోబర్ 2025 లోని 16,036 యూనిట్లతో పోలిస్తే కూడా, నవంబర్ అమ్మకాలు 47.61% తగ్గాయి. FY26 లో Q1 నుండి ఓలా విక్రయాలు నిరంతరంగా తగ్గుముఖం పట్టడం, మార్కెట్‌లో పోటీ పెరగడం కారణంగా కంపెనీ మొత్తం పనితీరు బలహీనపడుతోంది.
ఓలా మోడల్స్, ధరలు
ఓలా ప్రస్తుతం తమ ఇ-స్కూటర్ శ్రేణిలో 4 మోడళ్లను విక్రయిస్తోంది. S1 X ధర రూ.84,999 నుంచి ప్రారంభమై, S1 Pro+ ధర రూ.1,54,999 వరకు ఉంది. దీనితో పాటు ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శ్రేణిలో ప్రస్తుతం 2 మోడళ్ల బుకింగ్‌లు నడుస్తున్నాయి. బేస్ మోడల్ రోడ్‌స్టర్ X ధర రూ.లక్ష నుంచి(ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

