CIBIL Score : సిబిల్ స్కోర్ 750 ఉన్నా లోన్ రావడం లేదా? అసలు కారణాలు ఇవే.. జాగ్రత్త.

CIBIL Score : సిబిల్ స్కోర్ 750 ఉన్నా లోన్ రావడం లేదా? అసలు కారణాలు ఇవే.. జాగ్రత్త.
X

CIBIL Score : సాధారణంగా లోన్ కావాలంటే అందరూ చూసేది క్రెడిట్ స్కోర్. మన దేశంలో చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే.. క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే చాలు, కళ్లు మూసుకుని బ్యాంకులు లోన్ ఇచ్చేస్తాయని. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. మంచి స్కోర్ ఉన్నా సరే, కొన్నిసార్లు బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్‌సీలు లోన్ అప్లికేషన్‌ను తిరస్కరిస్తాయి. స్కోర్ బాగున్నా లోన్ ఎందుకు రాదు? అసలు బ్యాంకులు మీ ప్రొఫైల్‌లో ఏం చూస్తాయి? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్ అనేది మీరు గతంలో తీసుకున్న అప్పులను ఎంత క్రమశిక్షణతో కట్టారు అనేదానికి ఒక కొలమానం మాత్రమే. కానీ బ్యాంకులు లోన్ ఇచ్చేముందు మీ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. మీ నెలవారీ ఆదాయం ఎంత? అది క్రమంగా వస్తోందా? మీరు చేసే ఉద్యోగం ఎంత కాలం ఉంటుంది? వంటివి ప్రధానం. మీరు తరచుగా ఉద్యోగాలు మారుస్తున్నా లేదా మీ ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా.. బ్యాంకులు మీకు లోన్ ఇవ్వడానికి వెనకాడుతాయి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఈఎంఐలు కట్టగలరా లేదా అనే భయం వారికి ఉంటుంది.

మరో ముఖ్యమైన కారణం డెబ్ట్-టు-ఇన్‌కమ్ రేషియో. అంటే మీ జీతంలో ఎంత శాతం ఇప్పటికే ఉన్న అప్పులకి (హోమ్ లోన్, కార్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు) పోతోంది అనేది లెక్కగడతారు. మీ క్రెడిట్ స్కోర్ 800 ఉన్నా సరే.. మీ జీతంలో 50-60 శాతం ఇప్పటికే ఈఎంఐల రూపంలో కట్ అవుతుంటే, కొత్త లోన్ ఇవ్వడం రిస్క్ అని బ్యాంకులు భావిస్తాయి. అదనపు భారం పడితే మీరు డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని భావించి అప్లికేషన్‌ను రిజెక్ట్ చేస్తారు.

చాలా మంది చేసే ఇంకో తప్పు.. లోన్ కోసం ఒకేసారి నాలుగైదు బ్యాంకుల్లో అప్లై చేయడం. మీరు ప్రతిసారి లోన్ కోసం అడిగినప్పుడు బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్టును చెక్ చేస్తాయి. దీనిని హార్డ్ ఎంక్వైరీ అంటారు. మీ రిపోర్టులో ఇలాంటి ఎంక్వైరీలు ఎక్కువగా కనిపిస్తే.. మీకు డబ్బుల అవసరం చాలా ఎక్కువగా ఉందని లేదా మీ ఆర్థిక పరిస్థితి బాలేదని బ్యాంకులు నెగటివ్ సెగ్నల్ తీసుకుంటాయి. దీనివల్ల కూడా లోన్ రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది.

వీటితో పాటు డాక్యుమెంటేషన్ లోపాలు, తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా మీరు ఉండే ఏరియా, మీరు పనిచేసే కంపెనీ ప్రొఫైల్ వంటివి కూడా లోన్ మంజూరులో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని బ్యాంకులు కొన్ని నిర్దిష్ట రంగాల్లో పనిచేసే వారికి లోన్లు ఇవ్వకూడదని అంతర్గత పాలసీలు పెట్టుకుంటాయి. అందుకే కేవలం క్రెడిట్ స్కోర్ మీద మాత్రమే ఆధారపడకుండా.. ఆదాయం స్థిరంగా ఉండేలా చూసుకోవడం, అనవసరమైన లోన్ ఎంక్వైరీలు చేయకపోవడం, పక్కాగా డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం ద్వారా లోన్ వచ్చే అవకాశాలను పెంచుకోవచ్చు.

Tags

Next Story