Home Loan : హోమ్ లోన్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ ఇల్లు వేలం వేయకముందే ఇవి తెలుసుకోండి.

Home Loan : సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలని నిజం చేసుకోవడానికి చాలామంది హోమ్ లోన్ తీసుకుంటారు. అయితే ఏదైనా కారణం చేత లోన్ వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోతే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. లోన్ కట్టకపోతే బ్యాంకులు ఇంటిని వేలం వేస్తాయన్న భయం అందరిలోనూ ఉంటుంది. కానీ, బ్యాంకు మీ ఇంటిని వేలం వేయడం అంత సులభం కాదు. దీనికి కొన్ని చట్టపరమైన నిబంధనలు, ప్రక్రియలు ఉన్నాయి. సర్ఫేసీ చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులు ఎలా వ్యవహరిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఒక వ్యక్తి వరుసగా మూడు నెలల పాటు అంటే 90 రోజుల వరకు ఈఎంఐ చెల్లించకపోతే, బ్యాంకులు ఆ లోన్ అకౌంట్‌ను ఎన్‌పీఏ లేదా నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తాయి. ఎన్‌పీఏగా మార్చిన తర్వాత కూడా బ్యాంకు నేరుగా మీ ఇంటిని వేలం వేయదు. మొదట మీకు 60 రోజుల గడువు ఇస్తూ ఒక లీగల్ నోటీసు పంపిస్తుంది. ఈ నోటీసు అందిన తర్వాత మీరు బ్యాంకుకు సమాధానం ఇవ్వవచ్చు లేదా మీ ఆర్థిక ఇబ్బందులను వివరించవచ్చు. ఒకవేళ మీరు ఇచ్చే వివరణకు బ్యాంకు 15 రోజుల్లోపు బదులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి సుమారు 105 రోజుల సమయం పడుతుంది.
నోటీసు గడువు ముగిసినా మీరు స్పందించకపోతే లేదా బకాయిలు చెల్లించకపోతే, బ్యాంకు ఆ ఆస్తిని తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత ఇంటి విలువను లెక్కించి, దాన్ని వేలం వేయడానికి సిద్ధమవుతుంది. పబ్లిక్ వేలం లేదా ఈ-వేలం ద్వారా ఇళ్లను విక్రయిస్తారు. ఈ వేలం నిర్వహించడానికి కనీసం 30 రోజుల ముందు పేపర్లో ప్రకటన ఇవ్వాలి. మొదటి ప్రయత్నంలో ఇల్లు అమ్ముడుపోకపోతే, మరో 15 రోజుల అదనపు నోటీసుతో రెండోసారి వేలం వేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రక్రియ కోసం బ్యాంకు కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఒకవేళ వేలం ప్రక్రియ మొదలైన తర్వాత కూడా మీరు మొత్తం బకాయిని వడ్డీతో సహా చెల్లించగలిగితే, ఆ వేలాన్ని నిలిపివేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈఎంఐలు మిస్ అవుతున్నప్పుడు బ్యాంకు అధికారులతో మాట్లాడి సమయం కోరడం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ వంటి ఆప్షన్లను ఎంచుకోవడం ఉత్తమం. బ్యాంకులకు కూడా వేలం వేయడం కంటే వసూలు చేసుకోవడమే ఇష్టం ఉంటుంది కాబట్టి, సకాలంలో స్పందిస్తే మీ ఇంటిని మీరు కాపాడుకోవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
