Honda City vs Hyundai Verna : హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. ఈ రెండింటిలో ఏది బెస్ట్?

Honda City vs Hyundai Verna : భారతీయ కార్ల మార్కెట్లో మిడ్-సైజ్ సెడాన్ల విభాగంలో హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మధ్య ఎప్పుడూ ఒక యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఒకప్పుడు కేవలం సంపన్నులకే పరిమితమైన ప్రీమియం ఫీచర్లు ఇప్పుడు ఈ రెండు కార్లలో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. మీరు రోజువారీ ప్రయాణాలకు ఒక స్టైలిష్ మరియు సౌకర్యవంతమైన కారు కోసం చూస్తున్నట్లయితే, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను గమనించడం చాలా ముఖ్యం. 2026 నాటి అప్డేటెడ్ ఫీచర్లతో ఈ రెండు కార్లు ఇప్పుడు సరికొత్తగా ముస్తాబయ్యాయి.
ధరల వివరాలు
ధర విషయంలో హ్యుందాయ్ వెర్నా కొంచెం తక్కువ ధరతో ప్రారంభమవుతుంది. వెర్నా ప్రారంభ ధర రూ.10,98,400 (ఎక్స్-షోరూమ్) గా ఉండగా, హోండా సిటీ రూ.11,95,300 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. అయితే టాప్ ఎండ్ వేరియంట్ల విషయానికి వచ్చేసరికి ఫీచర్ల బట్టి రెండు కార్లు దాదాపు సమానమైన ధరలను కలిగి ఉంటాయి.
ఇంజన్, పర్ఫామెన్స్
హోండా సిటీ తన క్లాసిక్ 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 121 PS పవర్, 145 Nm టార్క్‌ను ఇస్తుంది. సిటీ కారు దాని స్మూత్ డ్రైవింగ్ అనుభవానికి పెట్టింది పేరు. మరోవైపు హ్యుందాయ్ వెర్నా రెండు రకాల ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. సాధారణ 1.5 లీటర్ ఇంజన్ 115 PS పవర్ ఇస్తే, స్పీడ్ ఇష్టపడే వారి కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది ఏకంగా 160 PS పవర్, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ రోడ్లపై దూసుకుపోతుంది.
డిజైన్, ఇంటీరియర్
డిజైన్ పరంగా వెర్నా చాలా మోడ్రన్ గా, ఫ్యూచరిస్టిక్ లుక్ తో కనిపిస్తుంది. ముఖ్యంగా ముందు వైపు ఉండే ఎల్ఈడీ లైట్ బార్ యువతను బాగా ఆకర్షిస్తోంది. హోండా సిటీ మాత్రం ఎప్పుడూ క్లాసిక్ అండ్ డీసెంట్ లుక్ ను ఇష్టపడే వారికి నచ్చుతుంది. వెర్నా వీల్‌బేస్ 2,670 మిమీ ఉండటం వల్ల లోపల స్పేస్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అయితే హోండా సిటీ సీటింగ్ కంఫర్ట్ లో ఇప్పటికీ తన మార్కును కాపాడుకుంటోంది. బూట్ స్పేస్ విషయంలో వెర్నా (528 లీటర్లు) సిటీ (506 లీటర్లు) కంటే కొంచెం ముందంజలో ఉంది.
టెక్నాలజీ, సేఫ్టీ:
టెక్నాలజీలో వెర్నా ఒక అడుగు ముందే ఉంది. ఇందులో డ్యూయల్ 10.25 ఇంచ్ స్క్రీన్లు, బోస్ 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వెంట్ లేటెడ్ సీట్లు ఉన్నాయి. హోండా సిటీలో 8 ఇంచ్ టచ్ స్క్రీన్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో రెండు కార్లు 5-స్టార్ రేటింగ్ సాధించాయి. రెండింటిలోనూ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్ ఉంది, ఇది ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. వెర్నాలో 360 డిగ్రీ కెమెరా అదనపు ఆకర్షణగా ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
