Honda : హోండా నుంచి మరో షాక్.. రెబెల్ 500 క్రూయిజర్ బైక్ అమ్మకాలు నిలిపివేత.

Honda : హోండా నుంచి మరో షాక్.. రెబెల్ 500 క్రూయిజర్ బైక్ అమ్మకాలు నిలిపివేత.
X

Honda : ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా భారతీయ వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. గతంలో CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ SP ని తమ వెబ్‌సైట్ నుంచి తొలగించిన కంపెనీ, ఇప్పుడు రెబెల్ 500 క్రూయిజర్ బైక్‌ను కూడా నిశ్శబ్దంగా నిలిపివేసింది. ఈ ఏడాది కొత్తగా విడుదలైన ఈ మోడల్‌ను హోండా వెబ్‌సైట్ నుంచి తొలగించడం, కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లను నిరాశపరిచింది.

గత కొన్ని వారాల క్రితం ఫైర్‌బ్లేడ్ SP ని వెబ్‌సైట్ నుంచి తొలగించిన హోండా, తాజాగా రెబెల్ 500 ను కూడా తొలగించింది. ఈ రెబెల్ 500 బైక్ భారత మార్కెట్‌లో రూ.5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉండేది. ఇది CBU (కంప్లీట్‌లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా అంటే విదేశాల నుంచి పూర్తిగా నిర్మించి దిగుమతి చేసుకుని అమ్మేవారు. గురుగ్రామ్, ముంబై, బెంగళూరులో ఉన్న హోండా బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే దీని అమ్మకాలు జరిగేవి.

ఈ మోటార్‌సైకిల్‌ను తొలగించడానికి ప్రధాన కారణం, హోండా భారత్‌కు పరిమిత సంఖ్యలో మాత్రమే యూనిట్లను కేటాయించడం. ఆ కేటాయించిన స్టాక్ అంతా ఇప్పుడు అమ్ముడుపోయి ఉండవచ్చు. స్టాక్ అయిపోయినప్పుడు, కంపెనీ తాత్కాలికంగా ఆ మోడల్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించడం సాధారణంగా జరుగుతుంది. దీని అర్థం, బైక్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయిందని కాదు.

హోండా గత నెలలోనే గ్లోబల్ మార్కెట్ కోసం రెబెల్ 500 మోడల్‌కు కొత్త రంగులతో అప్‌డేట్‌ను కూడా విడుదల చేసింది. దీంతో ఇది భారత్‌కు కూడా అప్‌డేట్ అవుతుందని ఆశించారు. అయితే, ప్రస్తుతానికి ఇది అమ్ముడుపోవడంతో, హోండా భారత మార్కెట్‌కు కొత్త యూనిట్లను కేటాయిస్తేనే ఈ మోటార్‌సైకిళ్లు తిరిగి వస్తాయి. గతంలో CB300R మోడల్‌ను కూడా ఇదే విధంగా వెబ్‌సైట్ నుంచి తొలగించి, ఆ తర్వాత కొత్త బ్యాచ్‌ను తిరిగి తీసుకువచ్చింది.

Tags

Next Story