Foreign Currency : విదేశీ నోట్లు ఇంట్లో ఉంటే జైలుకేనా ? ఈ రూల్స్ తెలిస్తే ధైర్యంగా ఉండొచ్చు

Foreign Currency : విదేశీ నోట్లు ఇంట్లో ఉంటే జైలుకేనా ? ఈ రూల్స్ తెలిస్తే ధైర్యంగా ఉండొచ్చు
X

Foreign Currency : విదేశీ ప్రయాణాలు చేసే వారు లేదా పిల్లలను విదేశాలకు పంపే తల్లిదండ్రులు ఇంట్లో కొంత విదేశీ నగదు (డాలర్లు, యూరోలు వంటివి) ఉంచుకోవడం సహజం. అయితే, ఇంట్లో ఎంత విదేశీ కరెన్సీ ఉంచుకుంటే అది చట్టబద్ధం? ఐటీ దాడులు జరిగితే పరిస్థితి ఏంటి? తాజాగా ముంబైకి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కేసులో ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ నేపథ్యంలో ఫెమా నిబంధనలు ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

ముంబైకి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి ఇంట్లో 2021లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు రూ.5.6 లక్షల విలువైన విదేశీ కరెన్సీ దొరికింది. సరైన ఆధారాలు లేవంటూ ఐటీ శాఖ ఆ నగదును సీజ్ చేసింది. దీనిపై ప్రశాంత్ న్యాయపోరాటం చేశారు. తన కుమార్తె విదేశాల్లో చదువుతోందని, కుటుంబ సభ్యులు తరచూ విదేశాలకు వెళ్తుంటారని.. ఆ సమయంలో లీగల్‌గా కొనుగోలు చేసిన నగదులో మిగిలినదే ఇదని ఆయన వాదించారు. ఇందుకు సంబంధించి పాస్‌పోర్ట్ ఎంట్రీలు, ఫోరెక్స్ డీలర్ రసీదులను కోర్టుకు సమర్పించారు. వాదనలు విన్న ముంబై ఐటీఏటీ, నగదు కొనుగోలు మూలం స్పష్టంగా ఉన్నప్పుడు దానిని అక్రమమని చెప్పలేమని తీర్పునిస్తూ, సీజ్ చేసిన నగదును తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.

భారతదేశంలోని ఫెమా చట్టం ప్రకారం.. ఒక భారతీయ పౌరుడు తన వద్ద గరిష్టంగా 2,000 అమెరికన్ డాలర్ల వరకు (లేదా దానికి సమానమైన ఇతర విదేశీ కరెన్సీ) ఎంత కాలమైనా తన దగ్గరే ఉంచుకోవచ్చు. దీనికి ఎలాంటి కాలపరిమితి లేదు. అదే విదేశీ నాణేల విషయానికి వస్తే, వాటిని ఎంతైనా ఉంచుకోవచ్చు, వాటిపై ఎటువంటి పరిమితి లేదు. ఒకవేళ మీ దగ్గర 2,000 డాలర్ల కంటే ఎక్కువ నగదు ఉంటే, విదేశాల నుంచి వచ్చిన 180 రోజుల్లోపు వాటిని అధీకృత బ్యాంకులో డిపాజిట్ చేయాలి లేదా ఆర్‌ఎఫ్‌సీ అకౌంట్‌లో జమ చేయాలి. అలా చేయకపోతేనే జరిమానా పడుతుంది.

ఇక ఆదాయపు పన్ను రిటర్న్స్ విషయానికి వస్తే, మీ దగ్గర ఉన్న విదేశీ కరెన్సీ ఫెమా పరిమితి లోపు ఉంటే, దానిని షెడ్యూల్ ఎఫ్ఏలో చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి భారతదేశంలోనే మీ వద్ద ఉన్న నగదు కిందకు వస్తాయి. అయితే, మీ వార్షిక ఆదాయం రూ.కోటి కంటే ఎక్కువగా ఉండి, మీరు షెడ్యూల్ ఏఎల్ నింపుతుంటే మాత్రం, మీ దగ్గర ఉన్న క్యాష్ ఇన్ హ్యాండ్‎లో ఈ విదేశీ నగదు విలువను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

మొత్తానికి విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు మిగిలిన చిల్లర లేదా తదుపరి ప్రయాణం కోసం దాచుకున్న నగదు విషయంలో కంగారు పడాల్సిన పనిలేదని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. అయితే ఆ నగదును ఎప్పుడు, ఎక్కడ కొన్నారనే దానికి సంబంధించిన రసీదులు, విదేశీ ప్రయాణాల రికార్డులు భద్రంగా ఉంచుకోవడం ఉత్తమం. ఇది భవిష్యత్తులో ఐటీ సోదాలు లేదా విచారణలు ఎదురైనప్పుడు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

Tags

Next Story