Credit Card : క్రెడిట్ కార్డ్ తెలివిగా వాడండి.. నష్టపోకుండా లాభం పొందాలంటే ఈ టిప్స్ పాటించండి.

Credit Card : క్రెడిట్ కార్డ్ విషయంలో సమాజంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు. మొదటి వారు, కార్డు దొరికితే విచక్షణారహితంగా వాడి, అప్పుల ఊబిలో కూరుకుపోయేవాళ్లు. రెండో రకం వారు క్రెడిట్ కార్డ్ అంటేనే భయపడి, దానికి దూరంగా పారిపోయేవాళ్లు. మూడో రకం వారు, కార్డును ఒక సాధనంగా మాత్రమే చూస్తూ, దాని ద్వారా వచ్చే లాభాలు, సౌకర్యాలను తెలివిగా ఉపయోగించుకుంటూ తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే తెలివైన వాళ్లు. క్రెడిట్ కార్డ్ అంటే ఒక లిమిట్లో ఇచ్చే అప్పు లాంటిది. ఈ లిమిట్స్‌లో వాడుకుంటే క్రెడిట్ కార్డు నిజంగా వరంగా మారుతుంది. లేకపోతే అప్పుల ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉంది. మరి కార్డును అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. క్రెడిట్ లిమిట్‌కు ఒక పరిమితి ఉండాలి
ప్రతి క్రెడిట్ కార్డుకు ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుంది. కొందరికి రూ.20,000 ఉండొచ్చు, మరికొందరికి రూ.2,00,000 ఉండొచ్చు. అయితే, మీరు మీ మొత్తం క్రెడిట్ లిమిట్‌లో 75% ను మించకుండా ఖర్చు చేయకుండా ఉండాలి. మీరు మొత్తం లిమిట్ పూర్తిగా వాడేస్తే, మీ క్రెడిట్ స్కోర్‌కు నష్టం జరగవచ్చు. అలాగే, మీపై ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. అందుకే, ఖర్చును ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవాలి.
2. 45 రోజుల వడ్డీ లేని కాలాన్ని ఉపయోగించండి
క్రెడిట్ కార్డుల వల్ల లభించే అతిపెద్ద సౌకర్యం వడ్డీ లేని కాలం. సాధారణంగా ప్రతి నెలా ఒకసారి బిల్లు జనరేట్ అవుతుంది. మీరు కార్డు ఉపయోగించిన తేదీ నుంచి బిల్లు చెల్లించే గడువు వరకు దాదాపు 45 రోజుల వరకు వడ్డీ ఉండదు. మీ బిల్లింగ్ తేదీ, గడువు తేదీ ఎప్పుడు ఉందో తెలుసుకోండి. బిల్లు జనరేట్ అయిన తర్వాత కార్డు వాడకాన్ని ఎక్కువగా ఉంచండి. అప్పుడు మీకు దాదాపు 45 రోజుల వడ్డీ లేని కాలం లభిస్తుంది. ఈ విధంగా ఈ సౌలభ్యాన్ని సరిగ్గా వాడుకోవచ్చు.
3. ఖర్చులపై ఎప్పుడూ నిఘా ఉంచండి
మీరు ప్రతీ చిన్న ఖర్చుకు క్రెడిట్ కార్డ్ వాడుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకదాని కంటే ఎక్కువ కార్డులు ఉండి, అన్నింటినీ ఉపయోగిస్తుంటే, మీ ఖర్చు మీ చేతి దాటిపోయే ప్రమాదం ఉంది. అన్ని ఖర్చులను ఈఎంఐ కింద మార్చినప్పటికీ, అది పెద్ద అప్పుగా మారిపోవచ్చు. అందుకే కార్డు ద్వారా చేసే ప్రతి ఖర్చును తప్పకుండా ట్రాక్ చేయండి. నెలవారీ చెల్లింపుల విషయంలో స్పష్టతతో ఉండండి.
4. మినిమం బ్యాలెన్స్ చాలనే ధోరణి వద్దు
చాలా మంది తమ క్రెడిట్ కార్డ్ బిల్లు ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం మినిమం బ్యాలెన్స్‌ను మాత్రమే కట్టడం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా మీరు పెనాల్టీ నుంచి మాత్రమే తప్పించుకోగలరు. మిగిలిన మొత్తంపై వడ్డీ భారం మాత్రం తప్పకుండా పడుతుంది. ఈ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ప్రతిసారీ మొత్తం బిల్లును పూర్తిగా చెల్లించడానికి ప్రయత్నించండి.
5. ఫ్రీ ఆఫర్‌లు, రివార్డులను తెలుసుకోండి
క్రెడిట్ కార్డ్ కంపెనీలు తమ కార్డు వినియోగాన్ని ప్రోత్సహించడానికి రకరకాల ఫ్రీ ఆఫర్‌లు, రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు వంటివి అందిస్తాయి. మీ కార్డు ద్వారా ఏయే ఆఫర్‌లు ఉన్నాయో తెలుసుకోండి. మీకు అవసరమైన కొనుగోళ్లలో కార్డును వాడి, ఈ రివార్డులను, ఆఫర్‌లను తెలివిగా ఉపయోగించుకోండి. దీనివల్ల అదనపు లాభం చేకూరుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com