Hyundai : ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో.. ఏకంగా 26 కొత్త కార్లు లాంచ్ చేయనున్న హ్యుందాయ్.

Hyundai : ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో.. ఏకంగా 26 కొత్త కార్లు లాంచ్ చేయనున్న హ్యుందాయ్.
X

Hyundai : దక్షిణ కొరియాకు చెందిన అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశం కోసం ఒక భారీ ప్రణాళికను ప్రకటించింది. కంపెనీ రాబోయే ఐదేళ్లలో భారత మార్కెట్‌లో ఏకంగా రూ.45,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. అంతేకాదు, హ్యుందాయ్ ఈ కాలంలో 26 కొత్త మోడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో తొలిసారిగా పర్యటిస్తున్న హ్యుందాయ్ అధ్యక్షుడు, సీఈఓ జోసే మ్యూనోజ్ ఈ వివరాలను వెల్లడించారు. తమ మొత్తం వ్యాపారంలో 30% వాటా ఎగుమతుల ద్వారా రావాలని హ్యుందాయ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ 2030 నాటికి రూ.45,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. భారతదేశాన్ని హ్యుందాయ్‌కి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్‌గా మార్చడమే ఈ పెట్టుబడి వెనుక ప్రధాన లక్ష్యం. కంపెనీ తన మొత్తం ఆదాయాన్ని 1.5 రెట్లు పెంచాలని, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఒక ట్రిలియన్ (రూ.లక్ష కోట్ల) టర్నోవర్‌ను దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారతదేశం హ్యుందాయ్‌కి మూడవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.

హ్యుందాయ్ తన 2030 వృద్ధి రోడ్‌మ్యాప్‌లో భాగంగా మొత్తం 26 కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. వీటిలో 7 మోడళ్లు సరికొత్తవిగా ఉంటాయి. ఈ కొత్త లాంచ్‌ల ద్వారా కంపెనీ ఎంపీవీ(మల్టీ పర్పస్ వెహికల్), ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ విభాగాల్లోకి ప్రవేశించనుంది. అంతేకాకుండా, 2027 నాటికి భారతదేశం కోసం పూర్తిగా ఇక్కడే డిజైన్, అభివృద్ధి, తయారీ చేసిన ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేయాలని యోచిస్తోంది. అదే సంవత్సరంలో, హ్యుందాయ్ లగ్జరీ బ్రాండ్ అయిన జెనెసిస్ కూడా భారత మార్కెట్‌లో ప్రవేశించనుంది.

కంపెనీ ప్రకటించిన రూ.45,000 కోట్ల పెట్టుబడిలో 60% భాగం ఉత్పత్తి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం ఖర్చు చేస్తారు. మిగిలిన 40% ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా విజన్‌కు మద్దతుగా, భారతదేశాన్ని గ్లోబల్ ఎగుమతి హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మ్యూనోజ్ చెప్పారు. తమ మొత్తం అమ్మకాల్లో 30% వాటా ఎగుమతుల నుంచి రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Tags

Next Story