Hybrid SUVs : హ్యుందాయ్, కియా నుంచి హైబ్రిడ్ సునామీ.. మహీంద్రా, టాటా కోటలకు బీటలు తప్పవా?

Hybrid SUVs : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు హైబ్రిడ్ హవా నడుస్తోంది. దీనిని గమనించిన ప్రముఖ కొరియన్ దిగ్గజాలు హ్యుందాయ్, కియా మోటార్స్, 2026-2027 నాటికి పవర్ఫుల్ 7-సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలతో రంగంలోకి దిగేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో రాజ్యమేలుతున్న మహీంద్రా XUV 7XO, టాటా సఫారీలకు గట్టి పోటీ ఇచ్చేలా ఈ కార్లు రూపొందుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ ఇంజన్ పవర్, ఎలక్ట్రిక్ మోటార్ పొదుపు కలగలిసిన స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఇవి రాబోతున్నాయి.
కియా సోరెంటో
కియా ఇండియా ఈ ఏడాది తన మొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీని (కోడ్ నేమ్: MQ4i) పరిచయం చేయనుంది. ఇది అంతర్జాతీయంగా విజయవంతమైన సోరెంటో మోడల్ ఆధారంగా రూపొందుతోంది. ఇప్పటికే భారత్‌లో టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారులో వర్టికల్ ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, 19 ఇంచుల అల్లాయ్ వీల్స్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో సోరెంటో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్‌తో వస్తున్నప్పటికీ, భారత్ లో మాత్రం 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్‌తో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇదే ఇంజన్ సెటప్ భవిష్యత్తులో వచ్చే కియా సెల్టోస్ కొత్త జనరేషన్ లో కూడా వాడనున్నారు.
హ్యుందాయ్ Ni1i
హ్యుందాయ్ కూడా ఏమాత్రం తగ్గకుండా Ni1i అనే కోడ్ నేమ్ తో ఒక సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీపై పనిచేస్తోంది. ఇది హ్యుందాయ్ అల్కాజార్ కంటే పెద్దదిగా, ప్రీమియం టక్సన్ కంటే కొంచెం తక్కువ కేటగిరీలో ఉంటుంది. సమాచారం ప్రకారం, చైనాలో విక్రయించే టక్సన్ LWB (లాంగ్ వీల్ బేస్) మోడల్ ఆధారంగా ఈ కారును డిజైన్ చేస్తున్నారు. దీని పొడవు దాదాపు 4,630 మిమీ ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌కు ఎలక్ట్రిక్ పవర్‌ను జోడించి హైబ్రిడ్ వెర్షన్‌గా మార్చనున్నారు. ఈ కారు భారత మార్కెట్లో హ్యుందాయ్ కు అత్యంత కీలకమైన మోడల్ కానుంది.
పోటీ ఎవరితో?
ఈ రెండు కార్లు మార్కెట్లోకి వస్తే కేవలం టాటా, మహీంద్రా మాత్రమే కాదు.. టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతీ ఇన్విక్టోలకు కూడా గట్టి పోటీ తప్పదు. అలాగే రెనాల్ట్, నిస్సాన్ సంస్థలు కూడా తమ 7-సీటర్ హైబ్రిడ్ కార్లను 2026-27 నాటికి సిద్ధం చేస్తున్నాయి. హైబ్రిడ్ కార్ల వల్ల మైలేజీ పెరగడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుంది కాబట్టి వినియోగదారులు కూడా వీటి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రీమియం ఇంటీరియర్స్, అత్యాధునిక ఏడీఏఎస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లతో రానున్న ఈ కార్ల కోసం వాహన ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
