Hyundai : కిలోమీటరుకు కేవలం 47 పైసలే..హ్యుందాయ్ నుంచి ట్యాక్సీల సునామీ.

Hyundai : కిలోమీటరుకు కేవలం 47 పైసలే..హ్యుందాయ్ నుంచి ట్యాక్సీల సునామీ.
X

Hyundai : ట్యాక్సీ డ్రైవర్లకు, కమర్షియల్ వాహన రంగంలో ఉన్న వారికి హ్యుందాయ్ మోటార్ ఇండియా అదిరిపోయే తీపి కబురు అందించింది. ప్రైమ్ బ్రాండ్ పేరుతో రెండు సరికొత్త కార్లను మార్కెట్లోకి విడుదల చేసి, కమర్షియల్ మొబిలిటీ విభాగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఐ10 హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ ప్రైమ్ హెచ్‌బి, ఆరా సెడాన్ వెర్షన్ ప్రైమ్ ఎస్‌డి పేరుతో ఈ కార్లు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించాలనుకునే ట్యాక్సీ నిర్వాహకులకు ఇవి వరమనే చెప్పాలి.

హ్యుందాయ్ విడుదల చేసిన ఈ కొత్త ట్యాక్సీ రేంజ్‌లో ప్రైమ్ హెచ్‌బి ధర రూ.5,99,900 కాగా, ప్రైమ్ ఎస్‌డి ధర రూ.6,89,900 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. కేవలం రూ.5,000 చెల్లించి దేశవ్యాప్తంగా వీటిని బుక్ చేసుకోవచ్చు. ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థికంగా భారం కాకుండా ఉండేందుకు 72 నెలల వరకు సులభమైన ఈఎంఐ సౌకర్యాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మన్నిక ఉండేలా ఈ వాహనాలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఈ రెండు కార్లలోనూ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు కంపెనీ నుంచి వచ్చే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్ ఉంటుంది. మైలేజీ విషయానికి వస్తే.. ప్రైమ్ ఎస్‌డి కిలోకు 28.40 కిమీ, ప్రైమ్ హెచ్‌బి 27.32 కిమీ మైలేజీని ఇస్తాయి. హ్యుందాయ్ లెక్కల ప్రకారం, ఈ కార్లను నడిపేందుకు కిలోమీటరుకు కేవలం 47 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. అంతేకాదు, 5 ఏళ్ల వరకు లేదా 1.8 లక్షల కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా అందిస్తూ డ్రైవర్లకు పూర్తి భరోసా ఇస్తోంది.

కమర్షియల్ వాహనాలే కదా అని ఫీచర్లలో హ్యుందాయ్ ఎక్కడా తగ్గలేదు. వీటిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక ఏసీ వెంట్స్, పవర్ విండోస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 3-పాయింట్ సీట్ బెల్ట్స్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కావాలనుకునే వారు 9-అంగుళాల టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రియర్ కెమెరా, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ వంటి అదనపు యాక్సెసరీలను కూడా అమర్చుకోవచ్చు. ఈ కార్లు టైఫూన్ సిల్వర్, అట్లాస్ వైట్, ఎబిస్ బ్లాక్ రంగుల్లో లభిస్తున్నాయి.

ఈ లాంచ్ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండి తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ప్రైమ్ హెచ్‌బి, ప్రైమ్ ఎస్‌డి కార్లతో కమర్షియల్ విభాగంలో కొత్త విప్లవం తీసుకురాబోతున్నామని తెలిపారు. డ్రైవర్ల సంపాదన పెంచడం, ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. హ్యుందాయ్ భారీ సర్వీస్ నెట్‌వర్క్ వల్ల ట్యాక్సీ డ్రైవర్లకు మెయింటెనెన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు.

Tags

Next Story