New Hyundai Venue 2026 : 8 లక్షలకే లగ్జరీ.. 80 వేల బుకింగ్‌లతో చరిత్ర సృష్టించిన హ్యుందాయ్ వెన్యూ.

New Hyundai Venue 2026 : భారతదేశంలో సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో హ్యుందాయ్ మోటార్స్ నుంచి సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన సెకండ్ జనరేషన్ వెన్యూ ఇప్పుడు అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ కారు ధర, ఫీచర్లు చూసి జనాలు షోరూమ్‌ల వద్దకు క్యూ కడుతున్నారు. కేవలం నవంబర్ 2025లో లాంచ్ అయిన ఈ మోడల్‌కు ఇప్పటికే సుమారు 80,000 బుకింగ్‌లు రావడం విశేషం. హ్యుందాయ్ ఇండియా తాజాగా విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం..కొత్త వెన్యూకు మార్కెట్‌లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం రెండు నెలల్లోనే ఈ కారు 80,000 యూనిట్ల బుకింగ్‌లను సొంతం చేసుకుంది. జనవరి 2026లో ఏకంగా 12,413 యూనిట్లు అమ్ముడై, ఆ కారు చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ప్రస్తుతం హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో క్రెటా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా వెన్యూ నిలిచింది. ఈ స్థాయిలో బుకింగ్‌లు రావడానికి ప్రధాన కారణం దాని ధర మరియు ప్రీమియం ఫీచర్ల కలయిక అని నిపుణులు చెబుతున్నారు.
కొత్త హ్యుందాయ్ వెన్యూ ధర రూ.7.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది మొత్తం ఎనిమిది వేరియంట్లలో (HX2 నుంచి HX10 వరకు), ఎనిమిది రంగుల్లో అందుబాటులో ఉంది. పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ వంటి మూడు ఇంజన్ ఆప్షన్లతో వస్తున్న ఈ కారు, ప్రతి రకమైన కస్టమర్‌ను ఆకట్టుకుంటోంది.
రెండో తరం వెన్యూలో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ పరంగా భారీ మార్పులు చేశారు. కొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. లోపలి భాగంలో ప్రధానంగా 12.3-అంగుళాల డ్యూయల్ కర్వ్డ్ స్క్రీన్స్ (ఇన్ఫోటైన్మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్) హైలైట్‌గా నిలుస్తాయి. అంతేకాకుండా, ఇందులో ఉన్న ఫీచర్లు ఏకంగా ప్రీమియం కార్లను తలపిస్తున్నాయి. ఇందులో లెవల్-2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూలింక్ టెక్నాలజీ, ఆరు ఎయిర్ బ్యాగులు (స్టాండర్డ్), 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి సేఫ్టీ ఫీచర్లను అందించారు.
ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండటమే ఈ కారు విజయానికి కారణం. టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, వెన్యూ తన మార్కును స్పష్టంగా చూపిస్తోంది. దీని అప్‌డేటెడ్ డిజైన్, సెగ్మెంట్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన కొన్ని ఫీచర్లు (వెంటిలేటెడ్ సీట్లు, భారీ స్క్రీన్లు) కస్టమర్లను హ్యుందాయ్ వైపు తిప్పుకుంటున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
