Hyundai : హ్యుందాయ్ నుంచి భారీ ధరల పెంపు..ఇక టాటా నెక్సాన్ కి పోటీ మరింత టఫ్.

Hyundai : హ్యుందాయ్ నుంచి భారీ ధరల పెంపు..ఇక టాటా నెక్సాన్ కి పోటీ మరింత టఫ్.
X

Hyundai : హ్యుందాయ్ కార్లను ఇష్టపడే వారికి కంపెనీ షాకిచ్చింది. భారత మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న తన పాపులర్ ఎస్‌యూవీ వెన్యూ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇప్పుడు మరింత ప్రియం కానుంది. నవంబర్ 2025లో లాంచ్ అయిన న్యూ జనరేషన్ వెన్యూకి ఇదే మొదటి ధరల పెంపు కావడం గమనార్హం.

హ్యుందాయ్ తన వెన్యూ మోడల్‌లోని వివిధ వేరియంట్లపై రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ధరలను పెంచింది. ముఖ్యంగా బేస్, హయ్యర్ వేరియంట్లపై రూ.10,000 వరకు పెరుగుదల ఉండగా, మిడ్-లెవల్ వేరియంట్ అయిన HX5 పై అత్యధికంగా రూ.15,000 నుంచి రూ.20,000 వరకు భారం పడింది. అయితే, టాప్ ఎండ్ వేరియంట్ అయిన HX10 ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ పెంపుతో వెన్యూ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.15.69 లక్షల వరకు చేరుకుంది.

హ్యుందాయ్ కేవలం స్టాండర్డ్ వెన్యూ మాత్రమే కాకుండా, స్పోర్టీ లుక్ తో ఉండే వెన్యూ ఎన్-లైన్ ధరను కూడా సవరించింది. ఎన్-లైన్ లోని N6, N10 వేరియంట్లపై సుమారు రూ.10,000 పెంచింది. దీంతో వెన్యూ ఎన్-లైన్ ప్రారంభ ధర రూ.10.65 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. గత ఏడాది నవంబర్ లో ఈ కారును రూ.10.55 లక్షల ప్రారంభ ధరతో కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

ధరలు పెరిగినప్పటికీ ఇంజన్ ఆప్షన్లలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. వెన్యూలో ఇప్పటికీ మూడు రకాల ఇంజన్ ఛాయిస్ లు ఉన్నాయి:

1.2 లీటర్ పెట్రోల్: ఇది సిటీ డ్రైవింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

1.0 లీటర్ టర్బో పెట్రోల్: వేగాన్ని ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

1.5 లీటర్ డీజిల్: ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మైలేజీ పరంగా ఇది ఉపయోగపడుతుంది. వెన్యూ ఎన్-లైన్ మాత్రం కేవలం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది, దీనికి మాన్యువల్, DCT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ ప్రధానంగా టాటా నెక్సాన్, కియా సోనెట్, మారుతి బ్రెజ్జా, కొత్తగా వచ్చిన స్కోడా కైలాక్ వంటి కార్లతో పోటీ పడుతోంది. టాటా నెక్సాన్ ప్రారంభ ధర సుమారు రూ.7.32 లక్షలుగా ఉంది. ఇప్పుడు వెన్యూ ధర రూ.7.99 లక్షలకు పెరగడంతో, బడ్జెట్ లో ఎస్‌యూవీ కొనాలనుకునే వారు నెక్సాన్ లేదా ఇతర ఆప్షన్ల వైపు చూసే అవకాశం ఉంది. అయితే, వెన్యూలో ఉండే ప్రీమియం ఫీచర్లు, అధునాతన టెక్నాలజీ (ADAS వంటివి) ఇప్పటికీ దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి.

Tags

Next Story