Upcoming Hyundai Cars : హ్యుందాయ్ దెబ్బకి మార్కెట్ షేక్.. 2026లో రాబోతున్న 3 కార్లు ఇవే.

Upcoming Hyundai Cars : హ్యుందాయ్ దెబ్బకి మార్కెట్ షేక్.. 2026లో రాబోతున్న 3 కార్లు ఇవే.
X

Upcoming Hyundai Cars : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కార్ లవర్లకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. 2025లో వరుస లాంచ్‌లతో హడావిడి చేసిన ఈ కంపెనీ, ఇప్పుడు 2026 సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ ఏడాది హ్యుందాయ్ నుంచి రెండు సరికొత్త ఎస్‌యూవీలు, ఒక స్టైలిష్ సెడాన్ మార్కెట్లోకి రాబోతున్నాయి. విశేషమేమిటంటే.. ఈ మూడు కార్ల ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో అంటే రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువ ధరలోనే ఉండబోతున్నాయని సమాచారం. ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో క్రెటా రారాజుగా వెలుగొందుతున్నందున, హ్యుందాయ్ ఇప్పుడు ఇతర సెగ్మెంట్లలో తన పట్టును పెంచుకోవాలని చూస్తోంది.

ముందుగా టాటా పంచ్‌కు గట్టి పోటీ ఇస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి చెప్పుకోవాలి. 2023లో విడుదలైన ఈ మైక్రో ఎస్‌యూవీ ఇప్పుడు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రాబోతోంది. కొత్త డిజైన్ ప్రకారం.. దీనికి రీడిజైన్ చేసిన బంపర్, సరికొత్త హెడ్ ల్యాంప్స్, టెయిల్ లైట్స్, 15 ఇంచుల కొత్త అలాయ్ వీల్స్ రానున్నాయి. లోపల ఇంటీరియర్ కూడా చాలా లగ్జరీగా ఉండబోతోంది. ఇందులో 9.9 ఇంచుల డిజిటల్ క్లస్టర్ మరియు 12.9 ఇంచుల భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండవచ్చు. ఇది ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఓఎస్ పై పనిచేస్తుందని అంచనా.

ఇక సెడాన్ కార్ల అభిమానుల కోసం హ్యుందాయ్ తన పాపులర్ మోడల్ వెర్నాను కొత్త హంగులతో సిద్ధం చేస్తోంది. 2023 మార్చిలో వచ్చిన 6వ జనరేషన్ వెర్నాకు ఇది ఒక మేజర్ అప్‌డేట్ అని చెప్పాలి. కొత్త వెర్నా డిజైన్ హ్యుందాయ్ ఇంటర్నేషనల్ మోడల్ సోనాటా నుంచి ప్రేరణ పొందిందని స్పై ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. మరింత డైనమిక్ ఫ్రంట్ లుక్, రీడిజైన్ చేసిన స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, స్పోర్టీ బంపర్, కొత్త గ్రిల్ తో ఈ కారు రోడ్డుపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఏప్రిల్ 2026లో ఈ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

అన్నిటికంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. హ్యుందాయ్ నుంచి రాబోతున్న సరికొత్త ఎస్‌యూవీ బయాన్. సెప్టెంబర్ 2026 నాటికి ఈ కారు ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వవచ్చు. ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌పై రాబోతున్న స్పోర్టీ క్రాస్ఓవర్ డిజైన్ కారు. ఇందులో 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చనున్నారు. i20 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందుతున్న ఈ కారు, ప్రీమియం ఫీచర్లు కోరుకునే ఎస్‌యూవీ ప్రియులకు ఒక మంచి ఆప్షన్‌గా మారబోతోంది. మొత్తంమీద 2026 సంవత్సరం హ్యుందాయ్ ప్రియులకు కార్ల పండగే అని చెప్పాలి.

Tags

Next Story