ICRA: జీడీపీ వృద్ధి 6.2%కి పరిమితం కావొచ్చు

ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా తాజా నివేదిక ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ఇది గత సంవత్సరం నమోదైన 6.5 శాతంతో పోలిస్తే కొంత తగ్గుదలనే సూచిస్తోంది. ఇదే సమయంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి రేటు కూడా 6.4 శాతం నుండి 6 శాతానికి తగ్గుతుందని తెలిపింది. దేశ ఆర్థిక స్థితిగతులపై ఒక సమగ్ర విశ్లేషణను చేస్తూ, వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం 3.5 శాతానికి పైగా ఉండొచ్చని, అలాగే టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 1.8 శాతం పైనే నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.
ఇక్రా అంచనాల ప్రకారం...
ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 4.4 శాతంగా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ లావాదేవీల పరంగా, కరెంట్ ఖాతా లోటు (CAD) 1.3 శాతం నుంచి 1.2 శాతానికి దిగొస్తుందని అంచనా వేసింది. గ్రామీణ గిరాకీ పుంజుకునే అవకాశాలను కూడా ఈ నివేదికలో వివరించారు. రబీ సీజన్‌లో నగదు ప్రవాహం మెరుగ్గా ఉండటం, రిజర్వాయర్లలో నీటి మట్టాలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం వంటి అంశాలు గ్రామీణ వినియోగాన్ని పెంచగలవని పేర్కొంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, వడ్డీ రేట్లు తగ్గడంతో ఈఎంఐలు తగ్గటం, అలాగే
ఆదాయపు పన్నుల్లో ఇచ్చిన ఉపశమనంతో కుటుంబాల వద్ద మిగిలే డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచుతాయని ఇక్రా విశ్లేషించింది. దీనివల్ల వినియోగ వ్యయం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వొచ్చని అభిప్రాయపడింది. సేవల ఎగుమతులు వస్తువుల కంటే వేగంగా పెరిగే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయాలు 10.1 శాతం పెరగడం వల్ల పెట్టుబడి కార్యకలాపాలకు ప్రోత్సాహం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.
మరో కీలక అంశం..
వ్యవసాయ రంగానికి సంబంధించిన మరొక ముఖ్యమైన అంశంగా ట్రాక్టర్ల విక్రయాలను ఇక్రా ప్రస్తావించింది. 2025-26లో ట్రాక్టర్ల అమ్మకాలు 4 నుంచి 7 శాతం వృద్ధి సాధించవచ్చని తెలిపింది. రుతుపవనాలు బాగా కురిసే అవకాశాలు, వ్యవసాయ ఉత్పత్తులు పెరగవచ్చన్న అంచనాలే దీనికి కారణమవుతాయని పేర్కొంది. అంతేకాక, 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ట్రెమ్-V కాలుష్య నియంత్రణ నిబంధనలతోపాటు, కొత్త నిబంధనల అమలుకు ముందే కొనుగోళ్ల ఉధృతి ఉండవచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ట్రాక్టర్ల టోకు విక్రయాలు 7 శాతం వృద్ధి సాధించాయి, ఈ సంవత్సరం కూడా అదే విధంగా వృద్ధి కొనసాగవచ్చని ఇక్రా విశ్వాసం వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com