INDIA: భారత శాస్త్ర సాంకేతికరంగంలో అద్భుత మైలురాయి

ప్రపంచం రాజకీయ పరిణామాలు, యుద్ధ ఉద్రిక్తతలు, ఎన్నికల చర్చలతో మునిగిపోయిన వేళ… భారత శాస్త్ర సాంకేతిక రంగం మాత్రం నిశ్శబ్దంగా ఒక భారీ మైలురాయిని అందుకుంది. సైబర్ భద్రత, కమ్యూనికేషన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీసే క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో దేశం కీలక పురోగతి సాధించింది. స్వదేశీ పరిజ్ఞానంతో దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర విస్తరించే క్వాంటమ్ కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని భారత శాస్త్రవేత్తలు విజయవంతంగా నిరూపించడం, భవిష్యత్ డిజిటల్ భద్రతకు బలమైన పునాది వేస్తోంది. ఇప్పటివరకు హ్యాకింగ్, డేటా లీకులు, సైబర్ దాడులు వంటి సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ కొత్త వ్యవస్థ భద్రమైన కమ్యూనికేషన్‌కు మార్గం సుగమం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, విద్యుత్ గ్రిడ్లు, రైల్వే నెట్‌వర్క్‌లు వంటి కీలక మౌలిక వసతులపై జరిగే సైబర్ దాడులను అరికట్టడంలో ఇది కీలక పాత్ర పోషించే అవకాశముంది.
క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటే సాధారణంగా వినిపించే ఇంటర్నెట్ లేదా మొబైల్ కమ్యూనికేషన్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన సాంకేతిక విధానం. ఇందులో సమాచార మార్పిడి ఫోటాన్ల ద్వారా జరుగుతుంది. ఈ ప్రక్రియలో క్వాంటం ఎంటగల్మెంట్, క్వాంటం సూపర్ పొజిషన్ వంటి క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను వినియోగిస్తారు. సమాచారాన్ని భద్రంగా పంపిణీ చేయడానికి క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ అనే ప్రత్యేక విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో డేటా ఎన్‌క్రిప్షన్ కీలు మార్పిడి జరుగుతుంది, అవి మధ్యలో ఎవరైనా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే గుర్తించవచ్చు. అయితే క్వాంటమ్ కమ్యూనికేషన్‌లో ఒక పెద్ద సవాలు దూరం. ఫోటాన్ల రూపంలో ప్రయాణించే సంకేతాలు ఎక్కువ దూరం వెళ్లే కొద్దీ బలహీనపడతాయి. సాధారణ కమ్యూనికేషన్‌లాగా రిపీటర్లతో వాటిని బలోపేతం చేయడం సాధ్యం కాదు.
ఎందుకంటే అలా చేస్తే క్వాంటమ్ లక్షణాలు కోల్పోతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు భారత శాస్త్రవేత్తలు నెట్‌వర్క్‌ను చిన్న భాగాలుగా విభజించి, వాటిని ‘ట్రస్టెడ్ నోడ్స్’ ద్వారా అనుసంధానించే పద్ధతిని ఉపయోగించారు. ప్రతి సెగ్మెంట్‌లో క్యూకేడీ ద్వారా భద్రంగా కీలు మార్పిడి చేసి, ఆ చిన్న భాగాలన్నింటిని కలిపి పెద్ద నెట్‌వర్క్‌గా నిర్మించారు. ఈ విధానంతో వెయ్యి కిలోమీటర్ల పొడవైన నెట్‌వర్క్‌ను నిర్మించవచ్చని భారతదేశం నిరూపించింది. ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో QNu Labs వంటి స్వదేశీ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ కమ్యూనికేషన్ రంగంలో చైనా ముందంజలో ఉన్నప్పటికీ, భారత్ ఇప్పుడు ఆ స్థాయికి చేరువవుతున్నట్లు ఈ పురోగతి సూచిస్తోంది క్వాంటమ్ కమ్యూనికేషన్ ప్రయోజనాలు విస్తృతంగా ఉన్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన కమ్యూనికేషన్లు పూర్తిగా సురక్షితంగా ఉండేలా చేయవచ్చు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యరంగంలో సున్నితమైన వైద్య సమాచారాన్ని ఆసుపత్రుల మధ్య భద్రంగా పంపించవచ్చు. అంతేకాకుండా నీటి అడుగున, భూగర్భంలో, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ వ్యవస్థను అమలు చేయవచ్చు. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థలు ఆర్ఎస్ఏ వంటి పబ్లిక్-కీ ఎన్‌క్రిప్షన్ విధానాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి భద్రమని భావించినా, భవిష్యత్తులో కంప్యూటింగ్ శక్తి పెరిగితే వాటిని ఛేదించే అవకాశముంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
