India-Israel FTA : భారత్-ఇజ్రాయెల్ మధ్య చారిత్రక FTAకి రంగం సిద్ధం.. మార్గదర్శకాలపై సంతకాలు.

India-Israel FTA : భారత్, ఇజ్రాయెల్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ దిశగా ఇరు దేశాలు ఇటీవల టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో టారిఫ్‌ల పరిమితులను తొలగించడం, నాన్-టారిఫ్ ఆటంకాలను తగ్గించడం, మార్కెట్ అందుబాటును పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని 60 మందికి పైగా వ్యాపారవేత్తల భారతీయ బృందం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో FTA చర్చల దిశ, అంశాలపై ఇరు దేశాల నిపుణులు మార్గదర్శకాలను ఖరారు చేశారు.
భారతీయ ప్రతినిధి బృందం, ఇజ్రాయెల్ బృందం మధ్య జరిగిన చర్చల్లో అనేక ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించారు. పెట్టుబడి, సుంకాల విధానాల సరళీకరణ, సాంకేతికత బదిలీ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. రక్షణ రంగం, అంతరిక్ష పరిశోధన, ఫిన్‌టెక్, అగ్రిటెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ః, సైబర్ సెక్యూరిటీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డ్రిప్ ఇరిగేషన్ వంటి కీలక రంగాలపై పరస్పర సహకారం కోసం అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
భారత్, ఇజ్రాయెల్ మధ్య FTA ఏర్పడితే భారతీయ నిపుణులకు ఇజ్రాయెల్‌లో పని చేయడానికి పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో రూ.4.5 లక్షల కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి ఇప్పటికే 8-10 భారతీయ కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇది భారతీయ కార్మికులకు, ఇంజనీర్లకు గొప్ప అవకాశం. భారత్-అమెరికా మధ్య వ్యాపార ఒప్పందం కోసం చాలా కాలంగా చర్చలు జరుగుతున్నా, కొన్ని కఠినమైన డిమాండ్ల కారణంగా ఒప్పందం ముందుకు సాగడం లేదు.
తమ వ్యవసాయ, డైరీ ఉత్పత్తుల కోసం భారత మార్కెట్‌ను పూర్తిగా తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా పట్టుబడుతోంది. దీనికి భారత్ అంగీకరించడం లేదు. ఇజ్రాయెల్ కూడా డైరీ, వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నప్పటికీ ఈ విషయంలో భారత్‌పై ఒత్తిడి చేయడం లేదు. ఇజ్రాయెల్ ఈ సానుకూల వైఖరిని మంత్రి పీయూష్ గోయల్ స్వాగతించారు. ఈ అంశం FTA చర్చలు వేగంగా, సానుకూలంగా ముందుకు సాగడానికి దోహదపడుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

