INDIA: అమెరికా 'ప్యాక్ట్ సిలికా' కూటమిలోకి భారత్!

ప్రపంచ టెక్నాలజీ రంగంలో భారతదేశ ప్రాముఖ్యతను చాటిచెబుతూ, అమెరికా నేతృత్వంలోని ప్రతిష్టాత్మక 'ప్యాక్ట్ సిలికా' కూటమిలో భారత్‌కు చోటు లభించింది. భవిష్యత్ ప్రపంచాన్ని శాసించబోయే సెమీకండక్టర్ చిప్స్ సరఫరా గొలుసును బలోపేతం చేసే లక్ష్యంతో ఏర్పడిన ఈ గ్రూపులో భారత్ చేరడం ఒక చారిత్రాత్మక పరిణామంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఏమిటీ ప్యాక్ట్ సిలికా?
గతంలో మనకు ఆహారం, వస్త్రం, నివాసం ఎంత ముఖ్యమో.. నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI, రోబోటిక్స్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు అంతకంటే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సాంకేతికతలకు మూలధనం 'సిలికాన్ చిప్స్'. ఈ చిప్స్ ఉత్పత్తిలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా వీటి కొరత లేకుండా చూడటానికి అమెరికా ప్రభుత్వం 'ప్యాక్ట్ సిలికా'ను ఒక వ్యూహాత్మక కూటమిగా ఏర్పాటు చేసింది. డిసెంబర్ 2025లో ఈ కూటమిని ప్రకటించినప్పుడు జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్ , ఆస్ట్రేలియా వంటి సాంకేతిక దిగ్గజ దేశాలను ఇందులో చేర్చారు. అయితే, ఆ సమయంలో భారతదేశం పేరు లేకపోవడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిచింది.
భారత్ ఎందుకు అనివార్యం?
ప్రపంచంలోని అగ్రగామి టెక్ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ మరియు ఆపిల్ వంటి కంపెనీలు ఇప్పటికే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడి పెట్టాయి.భారతదేశంలో అందుబాటులో ఉన్న అపారమైన మానవ వనరులు , తక్కువ ధరకే లభించే శ్రమ శక్తి ఏ దేశానికి లేదు. భారత్ లేకుండా గ్లోబల్ టెక్నాలజీ సప్లై చైన్ గురించి ఆలోచించడం అసాధ్యమని టెక్ దిగ్గజాలు భావించాయి. అమెరికా ఎంబసీ ప్రతినిధుల సమాచారం ప్రకారం, కేవలం మైత్రీ బంధం కోసమే కాకుండా, వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా భారత్ ఇందులో చేరడం తప్పనిసరని అమెరికా గుర్తించింది. ఈ క్రమంలోనే, "భారతదేశం కంటే మరే ఇతర భాగస్వామి మాకు అంత అవసరం లేదు" అంటూ అమెరికా అత్యున్నత స్థాయి ప్రకటన చేయడం గమనార్హం.
భారత్‌కు కలిగే లాభాలు
సెమీకండక్టర్ హబ్‌గా భారత్: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టిన 'ఇండియా సెమీకండక్టర్ మిషన్' (ISM) కు ఈ కూటమి ద్వారా అంతర్జాతీయ సహకారం అందుతుంది. విదేశీ పెట్టుబడులు పెరగడంతో పాటు, లక్షలాది మంది యువతకు తయారీ రంగంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డిఫెన్స్ , స్పేస్ టెక్నాలజీలో వాడే హై-ఎండ్ చిప్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విలక్షణమైన శైలిలో అంతర్జాతీయ ఒప్పందాలను వేగవంతం చేస్తున్నారు. గతంలో గ్రీన్‌లాండ్‌పై ఆసక్తి చూపినట్లే, ఇప్పుడు భారత్‌ను ఒక అనివార్య భాగస్వామిగా గుర్తించి ఈ కీలక అడుగు వేశారు. త్వరలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలు వెల్లడికానున్నాయి. ఇది కేవలం ఎలక్ట్రానిక్స్ రంగానికే కాకుండా, భారత దౌత్య విజయానికి ఒక నిదర్శనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
