India Real Estate : రియల్ ఎస్టేట్‌లో రికార్డుల వేట..రోజుకు రూ.255 కోట్ల పెట్టుబడి.

India Real Estate : రియల్ ఎస్టేట్‌లో రికార్డుల వేట..రోజుకు రూ.255 కోట్ల పెట్టుబడి.
X

India Real Estate :భారతీయ రియల్ ఎస్టేట్ రంగం చరిత్రలో 2025 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. జెఎల్ఎల్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. ఈ ఒక్క ఏడాదిలోనే ప్రాపర్టీ రంగంలో ఏకంగా 10.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.93,200 కోట్లు) పెట్టుబడి వచ్చింది. ఇది 2024లో వచ్చిన పెట్టుబడుల కంటే చాలా ఎక్కువ. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2025లో ప్రతిరోజూ సగటున రూ.255 కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రంగంలోకి ప్రవహించాయి. సంస్థాగత పెట్టుబడిదారులు మన దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై చూపిస్తున్న అపారమైన నమ్మకానికి ఇదే నిదర్శనం.

సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో విదేశీ పెట్టుబడులే ఎక్కువగా ఉంటాయని మనం అనుకుంటాం. కానీ 2014 తర్వాత తొలిసారిగా మన దేశీ పెట్టుబడిదారులు 52 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచారు. ముఖ్యంగా రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్), ఇన్విట్స్ ద్వారా దాదాపు 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి రావడం విశేషం. దీనివల్ల సామాన్య ప్రజలు కూడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు అయ్యే అవకాశం పెరిగింది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా భారీగా నిధులను కేటాయించడంతో మార్కెట్ కళకళలాడుతోంది.

పెట్టుబడుల కేటాయింపులో ఆఫీస్ ప్రాపర్టీలు మళ్ళీ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. 2024తో పోలిస్తే ఆఫీస్ రంగంలో పెట్టుబడులు ఏకంగా రెట్టింపయ్యాయి. మొత్తం పెట్టుబడుల్లో 58 శాతం వాటా ఆఫీస్ స్థలాలదే కావడం గమనార్హం. ఇక నగరాల విషయానికి వస్తే, 29 శాతం పెట్టుబడులతో సిలికాన్ వ్యాలీ బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ముంబై తన హవాను కొనసాగించింది. కేవలం మెట్రో నగరాలే కాకుండా, టైర్-2 నగరాల్లో కూడా సుమారు 175 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం మార్కెట్ విస్తరణను సూచిస్తోంది.

పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం ఇళ్లు లేదా ఆఫీసులకే పరిమితం కాకుండా కొత్త రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు. డేటా సెంటర్లు, స్టూడెంట్ హౌసింగ్ (విద్యార్థుల వసతి), లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ ప్రాపర్టీలలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. స్థిరమైన ఆదాయం, దీర్ఘకాలిక సంపద సృష్టించుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇప్పుడు అత్యంత సురక్షితమైన మార్గంగా మారింది. విదేశీ పెట్టుబడిదారుల నిరంతర విశ్వాసం, దేశీయ సంస్థల బలం కలిసి భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాయి.

Tags

Next Story