India US Trade Deal : ట్రంప్‌తో అదిరిపోయే డీల్..భారత్‌కు రూ.27,000 కోట్ల భారీ లాభం..ఎస్‌బీఐ కీలక రిపోర్ట్.

India US Trade Deal : ట్రంప్‌తో అదిరిపోయే డీల్..భారత్‌కు రూ.27,000 కోట్ల భారీ లాభం..ఎస్‌బీఐ కీలక రిపోర్ట్.
X

India US Trade Deal : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం భారత్‌కు కాసుల వర్షం కురిపించబోతోంది. అటు అగ్రరాజ్యంతో వర్తక లాభాలు, ఇటు వెనెజులా నుంచి చౌక చమురు.. వెరసి భారత ఆర్థిక వ్యవస్థకు రెట్టింపు ప్రయోజనం కలగనుంది. దీనివల్ల దేశానికి ఏకంగా రూ.27,081 కోట్ల భారీ లాభం చేకూరనుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప దౌత్య విజయం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై గతంలో విధించిన 50 శాతం టారిఫ్‌ను (దిగుమతి సుంకం) భారీగా తగ్గించి 18 శాతానికి పరిమితం చేశారు. ఈ నిర్ణయం వల్ల భారత ఎగుమతిదారులకు ప్రపంచ మార్కెట్లో తిరుగులేని ఆధిక్యం లభించనుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జువెలరీ, లెదర్, కెమికల్స్ మరియు ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది. వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలతో పోలిస్తే ఇప్పుడు భారత వస్తువులు అమెరికాలో తక్కువ ధరకే లభించనున్నాయి.

ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఈ ఒప్పందంతో భారత్‌కు మరో భారీ ప్రయోజనం చమురు రూపంలో కలగనుంది. రష్యా నుంచి ఇన్నాళ్లూ చౌకగా చమురు కొనుగోలు చేసిన భారత్, ఇప్పుడు వెనెజులా వైపు దృష్టి సారిస్తోంది. వెనెజులాకు చెందిన మెరీ 16 రకం ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే బ్యారెల్‌కు 10 నుంచి 12 డాలర్లు తక్కువకే లభించనుంది. దీనివల్ల ఏటా భారతదేశానికి దాదాపు రూ.27,081 కోట్లు (సుమారు 3 బిలియన్ డాలర్లు) ఆదా అవుతాయని ఎస్‌బీఐ అంచనా వేసింది. ఇది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉండటానికి, ద్రవ్యోల్బణం తగ్గడానికి ఎంతగానో దోహదపడుతుంది.

ఈ ఒప్పందంలో భారత్ తన ప్రయోజనాలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. ముఖ్యంగా వ్యవసాయం, డైరీ (పాల ఉత్పత్తి) వంటి సున్నితమైన రంగాల్లో విదేశీ కంపెనీల ఆధిపత్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పాలు ఉత్పత్తి చేసే దేశంగా ఉన్న భారత్, తన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా అమెరికాతో బేరసారాలు సాగించింది. అమెరికాకు జరిగే మొత్తం ఎగుమతుల్లో భారత్ వాటా ఇప్పటికే 20 శాతానికి పైగా ఉంది. ఇప్పుడు పన్నులు తగ్గడంతో ఈ వాటా మరింత పెరిగి దేశంలోకి డాలర్ల ప్రవాహం పెరగనుంది.

రష్యాపై ఉన్న అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, వెనెజులా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకునే వెసులుబాటు భారత్‌కు కలిగింది. దీనివల్ల అంతర్జాతీయంగా ఏ దేశంలో సంక్షోభం వచ్చినా భారత్‌కు చమురు సరఫరాలో ఇబ్బందులు కలగవు. మొత్తానికి ట్రంప్‌తో కుదిరిన ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక బూస్టర్ డోస్ లాంటిదని ఎస్‌బీఐ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఎగుమతులు పెరగడం, చమురు ఖర్చు తగ్గడం వల్ల సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Tags

Next Story