SIP : మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్‌ఐపీల సునామీ.. మార్చిలో రూ.32,000 కోట్లతో రికార్డు.

SIP : భారత స్టాక్ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల ఆధిపత్యానికి సామాన్యుడు గట్టిపోటీనిస్తున్నాడు. ఒకప్పుడు కేవలం సంపన్నులకే పరిమితమైన షేర్ మార్కెట్, ఇప్పుడు మధ్యతరగతి ప్రజల చేతుల్లోకి వచ్చేసింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI) విడుదల చేసిన మార్చి నెల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగస్తులు, సామాన్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా మదుపు చేస్తూ కొత్త చరిత్ర సృష్టించారు.
భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ పట్ల ప్రజల్లో అవగాహన విపరీతంగా పెరిగింది. ప్రతి నెలా తమ జీతం నుండి చిన్న మొత్తాలను పొదుపు చేసే వారి సంఖ్య పెరగడంతో ఎస్‌ఐపీ పెట్టుబడులు మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరిలో రూ.29,845 కోట్లుగా ఉన్న ఎస్‌ఐపీ పెట్టుబడులు, మార్చి నెలలో ఏకంగా 8 శాతం పెరిగి రూ.32,087 కోట్లకు చేరాయి. అంటే సగటున రోజుకు వెయ్యి కోట్లకు పైగా నగదు ఎస్‌ఐపీల ద్వారా మార్కెట్లోకి వస్తోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై సామాన్యుడికి ఉన్న నమ్మకానికి నిదర్శనం.
కేవలం ఎస్‌ఐపీలే కాదు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (నేరుగా షేర్ మార్కెట్లో పెట్టేవి)లోకి కూడా పెట్టుబడులు వెల్లువెత్తాయి. మార్చి నెలలో ఈక్విటీ ఫండ్స్ లోకి రూ.40,450 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 61 శాతం వృద్ధి కావడం విశేషం. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడుల కంటే.. స్టాక్ మార్కెట్ దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇస్తుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకే మార్కెట్ హెచ్చుతగ్గుల్లో ఉన్నా కూడా ఇన్వెస్టర్లు వెనకడుగు వేయడం లేదు.
పెట్టుబడిదారులు ప్రస్తుతం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ పరిస్థితిని బట్టి పెద్ద, చిన్న, మధ్యతరహా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే సౌలభ్యం ఉండటంతో, ఒక్క మార్చిలోనే ఈ విభాగంలో రూ.10,054 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో రూ.6,263 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో రూ.6,063 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. చిన్న కంపెనీలు భవిష్యత్తులో మల్టీబ్యాగర్లుగా మారుతాయన్న ఆశతో ఇన్వెస్టర్లు వీటిపై మొగ్గు చూపుతున్నారు. అయితే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ నుంచి స్వల్పంగా నగదు విత్ డ్రా జరిగింది.
ఈక్విటీలో సంబరాలు కనిపిస్తుంటే, డెట్ ఫండ్స్ (సురక్షితమైనవి) మాత్రం వెలవెలబోయాయి. మార్చి నెలలో డెట్ ఫండ్స్ నుంచి ఏకంగా రూ.2.94 లక్షల కోట్ల నగదు బయటకు వెళ్ళిపోయింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో, కార్పొరేట్ కంపెనీలు తమ ముందస్తు పన్నులు చెల్లించడానికి, బ్యాలెన్స్ షీట్లను సర్దుబాటు చేసుకోవడానికి లిక్విడ్ ఫండ్స్ నుంచి డబ్బును విత్ డ్రా చేస్తాయి. అందుకే ఈ భారీ క్షీణత కనిపించింది. మరోవైపు, హైబ్రిడ్ ఫండ్స్ నుంచి కూడా రూ.16,538 కోట్ల విత్ డ్రాయల్స్ జరిగాయి. కానీ మల్టీ-అసెట్ అలోకేషన్ ఫండ్స్ మాత్రం రూ.5,212 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
