Rupee Vs Dollar : అమెరికన్ డాలర్‌కు రూపాయి షాక్..చమురు ధరలు తగ్గడంతో భారత్‎కు ఊరట.

Rupee Vs Dollar : అమెరికన్ డాలర్‌కు రూపాయి షాక్..చమురు ధరలు తగ్గడంతో భారత్‎కు ఊరట.
X

Rupee Vs Dollar : కొంతకాలంగా నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారత రూపాయికి మంగళవారం కొంత ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం వంటి కారణాల వల్ల రూపాయి 21 పైసలు బలపడింది. దీనితో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.56 వద్ద స్థిరపడింది. అయితే, ఫారిన్ క్యాపిటల్ విత్ డ్రాలు, డాలర్ బలం ఇప్పటికీ రూపాయికి సవాలుగా ఉన్నప్పటికీ, రూపాయిలో జోష్ రావడానికి గల కారణాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గత కొన్ని రోజులుగా ఒత్తిడిలో ఉన్న భారత రూపాయి, మంగళవారం పుంజుకొని 21 పైసలు లాభపడి 88.56 ప్రతి డాలర్ స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం రూపాయి బలోపేతానికి అతి పెద్ద కారణంగా నిలిచింది. భారతదేశం తన చమురు అవసరాలలో దాదాపు 85% దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, ముడి చమురు ధర తగ్గితే దేశీయ ఆర్థిక వ్యవస్థపై, రూపాయిపై సానుకూల ప్రభావం పడుతుంది. మంగళవారం బ్రెంట్ క్రూడ్ ధర 0.32% తగ్గి $64.68 వద్ద ట్రేడ్ అయింది.

ప్రాంతీయ కరెన్సీల బలహీనత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణల కారణంగా రూపాయి ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ చీఫ్ ఎనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. అంతర్‌బ్యాంక్ విదేశీ మారకపు మార్కెట్‌లో రూపాయి 88.55 ప్రతి డాలర్‌తో ప్రారంభమై చివరికి 88.56 వద్ద స్థిరపడింది.

రూపాయి కొంత బలపడినప్పటికీ, ప్రపంచ మార్కెట్లో డాలర్ బలం, ఎఫ్‌ఐఐ విత్ డ్రాలు సవాళ్లుగా మిగిలాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ 0.04% పెరిగి 99.75 వద్ద ఉంది. ఇది రూపాయిపై కొంత ఒత్తిడిని కొనసాగించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం కూడా భారతీయ మార్కెట్ నుంచి రూ.1,883.78 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నిధుల ఉపసంహరణ కూడా రూపాయిపై కొంత వ్యతిరేక ప్రభావాన్ని చూపింది.

ఈ అమ్మకాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 55 పాయింట్లు పడిపోయి 83,923.48 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 40.95 పాయింట్లు పడిపోయి 25,722.40 వద్ద స్థిరపడింది. రాబోయే రోజుల్లో రూపాయి దిశను ప్రపంచ ఆర్థిక గణాంకాలు, అమెరికా నుంచి వచ్చే నివేదికలు నిర్ణయిస్తాయి.

Tags

Next Story