Bike Exports : ఆఫ్రికా నుంచి ఆసియా దాకా....మేడ్ ఇన్ ఇండియా బైకుల కోసం క్యూ కడుతున్న విదేశీయులు.

Bike Exports : ప్రపంచవ్యాప్తంగా భారతీయ టూవీలర్ల హవా నడుస్తోంది. మేడ్ ఇన్ ఇండియా బైకులు, స్కూటర్లు విదేశీ రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. 2025 సంవత్సరం భారతీయ ద్విచక్ర వాహన రంగానికి ఒక గొప్ప ఊరటను ఇచ్చింది. చాలా కాలం పాటు మందగమనంలో ఉన్న మార్కెట్, ఎట్టకేలకు కోలుకుని దేశీయంగా 2 కోట్ల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటేసింది.
SIAM నివేదిక ప్రకారం.. 2024తో పోలిస్తే 2025లో దేశీయ అమ్మకాలు 5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే, ఈసారి అసలైన మ్యాజిక్ దేశీయ మార్కెట్ కంటే ఎగుమతుల్లోనే కనిపించింది. గతేడాది భారతీయ టూవీలర్ల ఎగుమతులు ఏకంగా 24 శాతం పెరిగి, సుమారు 49.4 లక్షల యూనిట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆఫ్రికా దేశాల్లో డిమాండ్ పెరగడం, దక్షిణ ఆసియా దేశాల నుంచి భారీగా ఆర్డర్లు రావడంతో ఇండియన్ కంపెనీలకు లాభాల పంట పండింది.
కంపెనీల వారీగా చూస్తే.. హీరో మోటోకార్ప్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. 2025లో హీరో సుమారు 57.5 లక్షల యూనిట్లను విక్రయించి మార్కెట్ లీడర్‌గా నిలిచింది. అయితే వృద్ధి రేటు విషయంలో మాత్రం టీవీఎస్ మోటార్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీవీఎస్ అమ్మకాలు ఏకంగా 15.7 శాతం పెరిగి, మొత్తం 39.8 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. బజాజ్, హోండా వంటి కంపెనీలు కూడా తమ ఉనికిని చాటుకున్నాయి.
2025లో కస్టమర్ల కొనుగోలు తీరులో స్పష్టమైన మార్పు కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ నిలకడగా ఉండగా, పట్టణాల్లో మాత్రం స్కూటర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆదాయం పెరగడం, సులభమైన లోన్ సౌకర్యాలు ఉండటంతో నగరవాసులు స్కూటర్ల వైపు మొగ్గు చూపారు. దీనికి తోడు ప్రభుత్వం జీఎస్టీలో ఇచ్చిన వెసులుబాటు, ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపులు, రెపో రేటు తగ్గింపు వంటివి సామాన్యుడికి బైక్ కొనుగోలును మరింత సులభం చేశాయి.
కొత్త ఏడాది 2026లో మరిన్ని కొత్త మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. ముఖ్యంగా యువతలో అడ్వెంచర్ బైకుల పట్ల క్రేజ్ పెరుగుతోంది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో కూడా కొత్త ఆవిష్కరణలు వస్తుండటంతో మార్కెట్ మరింత పుంజుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాటా కూడా క్రమంగా పెరుగుతుండటం శుభపరిణామం. మొత్తానికి భారతీయ ద్విచక్ర వాహన రంగం ఇప్పుడు గేర్ మార్చి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

