EV Sales : భారత్‌లో ఈవీ మార్కెట్ దూకుడు.. ఒకే నెలలో రికార్డ్ అమ్మకాలు.

EV Sales : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ అక్టోబర్ 2025లో కూడా స్థిరంగా వృద్ధి చెందుతోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. అన్ని సెగ్మెంట్‌లలోనూ రిటైల్ అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలు అత్యంత వేగంగా వృద్ధిని నమోదు చేశాయి. ఈ వృద్ధిలో ఏయే కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాయి. ఎన్ని వాహనాలు అమ్ముడయ్యాయో వివరంగా తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగం అక్టోబర్ 2025లో అత్యంత బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ విభాగం అమ్మకాలు గత సంవత్సరం (అక్టోబర్ 2023లో 11,464 యూనిట్లు) తో పోలిస్తే 57.5% పెరిగి 18,055 యూనిట్లకు చేరాయి. టాటా మోటార్స్ 7,239 యూనిట్ల అమ్మకాలతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కంపెనీ బలమైన EV పోర్ట్‌ఫోలియో, విస్తృత చార్జింగ్ నెట్‌వర్క్ దీనికి దోహదపడింది.
JSW ఎంజీ మోటార్ ఇండియా 4,549 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. మహీంద్రా & మహీంద్రా (XUV400 తో సహా) 3,911 యూనిట్ల అమ్మకాలతో వేగం పెంచింది. హ్యుందాయ్, కియా, బీవైడీ, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు కూడా మంచి వృద్ధిని సాధించాయి. వియత్నాం ఈవీ కంపెనీ విన్‌ఫాస్ట్ తొలిసారిగా భారత రిటైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టి 131 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది.
ప్యాసింజర్ ఈవీలు మంచి వృద్ధి సాధించగా, ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాలు ఏకంగా 105.9% భారీ వృద్ధిని సాధించి నిజమైన సంచలనాన్ని సృష్టించాయి. అక్టోబర్ 2023లో 858 యూనిట్లు అమ్ముడవగా, అక్టోబర్ 2025లో 1,767 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ విభాగంలోనూ టాటా మోటార్స్ 603 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో ఉంది. ఫ్లీట్ కస్టమర్‌లు, మున్సిపల్ అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరగడం దీనికి నిదర్శనం.
మహీంద్రా గ్రూప్ (306 యూనిట్లు), స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ (152 యూనిట్లు), యూలర్ మోటార్స్ (151 యూనిట్లు) కూడా ఈ సెగ్మెంట్‌లో గణనీయమైన వృద్ధిని చూపాయి. ఈవీ అమ్మకాలలో అతిపెద్ద వాటాను కలిగి ఉన్న ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లు కూడా స్థిరమైన పనితీరును ప్రదర్శించాయి. త్రీ వీలర్ల విభాగం 5.1% స్వల్ప వృద్ధితో 70,604 యూనిట్లకు చేరుకుంది. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో బలమైన డిమాండ్ కారణంగా ఈ సెగ్మెంట్ స్థిరంగా ఉంది. మహీంద్రా గ్రూప్ 11,860 యూనిట్లతో అగ్రస్థానంలో ఉండగా, బజాజ్ ఆటో (8,033 యూనిట్లు) తరువాతి స్థానంలో ఉంది.
టూ వీలర్ సెగ్మెంట్‌లో 2.6% స్వల్ప వృద్ధితో మొత్తం 1,43,887 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. బజాజ్ ఆటో (31,246 యూనిట్లు), టీవీఎస్ మోటార్ కంపెనీ (29,515 యూనిట్లు), ఏథర్ ఎనర్జీ (28,101 యూనిట్లు) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఓలా 16,036 యూనిట్లతో కొంచెం నెమ్మదిగా సాగింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

