EV Sales : రికార్డు క్రియేట్ చేసిన ఈవీ సేల్స్.. అక్టోబర్లో ఎన్ని లక్షలు అమ్ముడయ్యాయంటే ?

EV Sales : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ఈ సంవత్సరం అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలపై పన్నులు తగ్గించినప్పటికీ, ఈవీలపై 5% జీఎస్టీ స్థిరంగా ఉన్నా, అక్టోబర్ 2025లో ఈవీల రిటైల్ విక్రయాలు రికార్డు స్థాయిలో 2,34,274 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత సంవత్సరం అక్టోబర్ 2024తో పోలిస్తే 7% ఎక్కువ. అంటే, ఈసారి ప్రతి రోజు సగటున 7,557 ఈవీలు అమ్ముడయ్యాయి. ఈ పెరుగుదలలో టూ వీలర్లు, త్రీ వీలర్లు, ప్యాసింజర్, కమర్షియల్ వెహికల్స్ అనే నాలుగు విభాగాల్లోనూ మంచి వృద్ధి కనిపించింది.
భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ అక్టోబర్ 2025లో అత్యధిక రిటైల్ విక్రయాలను నమోదు చేసింది. గత నెలలో మొత్తం 2,34,274 ఈవీ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది అక్టోబర్ 2024 (2,19,722 యూనిట్లు)తో పోలిస్తే 7% వృద్ధిని సూచిస్తోంది. అంటే, ప్రతి రోజూ సగటున 7,557 ఈవీలు అమ్ముడయ్యాయి.
ఈ విజయం కేవలం ఒక్క విభాగానికే పరిమితం కాలేదు. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు 57% వృద్ధిని సాధించగా, ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాలు ఏకంగా 121% భారీ వృద్ధిని నమోదు చేశాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్లు 3%, త్రీ వీలర్లు 5% వృద్ధిని కనబరిచాయి. ఈవీ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ టూ వీలర్లు అత్యధిక వాటా. అక్టోబర్ నెలలో ఈ విభాగం అద్భుతమైన పనితీరును కనబరిచింది.
మొత్తం ఈవీ మార్కెట్‌లో e-2W వాటా సుమారు 61%గా ఉంది. అక్టోబర్‌లో 1,43,814 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి, ఇది అత్యధిక నెలవారీ విక్రయాల రికార్డు. దేశంలోని ఆరు ప్రధాన సంస్థలు – బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్, ఓలా ఎలక్ట్రిక్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కలిసి మొత్తం e-2W విక్రయాలలో 89% వాటాను తమ ఖాతాలో వేసుకున్నాయి.
ఈ నెలలో బజాజ్ ఆటో ఆరు నెలల తర్వాత టీవీఎస్ మోటార్‌ను అధిగమించి e-2W విక్రయాలలో మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల (కార్లు, ఎస్‌యూవీలు, ఎంపీవీలు) విభాగం కూడా గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈవీ మార్కెట్‌లో 8% వాటా ఉన్న e-PV విభాగంలో అక్టోబర్ 2025లో 17,942 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది కంటే 57%, సెప్టెంబర్ 2025 కంటే 9% ఎక్కువ.
ఈ విభాగంలో టాటా మోటార్స్ తన 40% మార్కెట్ వాటాను స్థిరంగా కొనసాగించింది. మహీంద్రా & మహీంద్రా తమ అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 4,497 యూనిట్లను విక్రయించింది. కియా ఇండియా తమ కొత్త క్యారెన్స్ క్లావిస్ ఈవీకి ఉన్న బలమైన డిమాండ్ కారణంగా 655 యూనిట్ల విక్రయాలతో బీవైడీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా వంటి సంస్థలను వెనక్కి నెట్టింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

